- అక్రమార్కులకు డిప్యూటి కమిషనర్ అండ.?
- సారూ ప్రభుత్వ భూమిని కాపాడరూ! అనే శీర్షికతో ఆదాబ్ లో కథనం
- రాజేంద్రనగర్ లో కబ్జాకోరుల ఇష్టారాజ్యం
- సర్వే నెంబర్ 156/1 ప్రభుత్వ స్థలం కబ్జా
- సర్కారు భూమిలో అక్రమ నిర్మాణాలు
- కమ్యూనిటీ హాల్ కు కేటాయించాం, జీహెచ్ఎంసీ కస్టడీలో ఉందన్న తహసీల్దార్
- డిప్యూటి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా లైట్ తీసుకున్న వైనం
- ఇదేమంటే కాంపౌండ్ వాల్ కడుతున్నామంటూ దాటవేత
- దర్జాగా కబ్జాచేసి ఇళ్లు కడుతున్న ఎమ్మెల్యే అనుచరులు
- అధికారుల సపోర్ట్ తో 80 శాతం పూర్తైన ఇళ్ల నిర్మాణాలు
- ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలంటున్న స్థానికులు
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు, వాళ్ల అనుచరులకు అధికారులు గులాంగిరి చేస్తున్నారు. అదీ అధికార, విపక్ష పార్టీకి చెందిన వారు ఎవరైనా సరే. కాకపోతే ప్రభుత్వంలో వారికైతే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువే ఇస్తున్నారు అనుకోండి. ప్రభుత్వ, అసైన్డ్ భూములు, సర్కారు ఆస్తులు కొల్లగొడుతున్న సరిచప్పుడు లేకుండా ఉంటున్నారు. ‘అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు’ గవర్నమెంట్ కు సంబంధించిన భూములు, ఆస్తులు ఏవైనా కానీ వారికి అప్పగించేస్తున్నారు. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు చెప్పొచ్చు. కానీ, అందులో ఓ మచ్చు తునక లాంటిదే ఈ వార్త.

రాజధాని నగరంలో భూములు చాలా కాస్లీ కావడం.. సిటీ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా భూమి కబ్జా చేస్తున్నారు. గవర్నమెంట్, అసైన్డ్, దేవాదాయ భూములు కనబడితే వెంటనే కర్చీఫ్ చేసి దాన్ని పొతం పెడుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండంలోని మైలార్ దేవులపల్లిలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గ్రామ శివారులోని సర్వే నెం 156/1లోని గవర్నమెంట్ భూమిని కొందరు కబ్జా పెట్టారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులే ప్రభుత్వ భూమిని ఖతం చేశారు. స్థానికంగా ఉన్న సర్కారు, అసైన్డ్ భూములను కబ్జా చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులకు అధికారుల ఫుల్ సపోర్ట్ ఉండడంతో వాళ్లు ఇంకింత రెచ్చిపోతున్నారు. వాస్తవానికి మైలార్ దేవులపల్లిలో గత సర్కారు.. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం సర్వే నెం 156/1లోని ప్రభుత్వ భూమి కేటాయించింది. అయితే ఇదే సర్వే నెంబర్ లోని కొంత భూమిలో ప్రజలు వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించుకున్నారు. ‘ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లు’గా పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిపై కబ్జాకోరుల కన్నుపడి దాన్ని కొట్టేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఖాళీగా ఉన్న సర్కారు స్థలంలో తొలుత కొందరు అక్రమార్కులు చదును చేసి ఆ భూమిలో ప్రహరీగోడ నిర్మాణం చేశారు.

‘కంచాలమ్మ కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని’ అన్న చందంగా యనకటి నుంచి వస్తున్న ప్రభుత్వ స్థలాలను కబ్జాకోరులు పొతం పెడుతున్నారు. సారూ.. ‘ప్రభుత్వ భూమిని’ కాపాడరూ! అనే శీర్షికతో ఆదాబ్ హైదరాబాద్‌లో గత నెల (ఫిబ్రవరి) 10న కథనం ప్రచురించడం జరిగింది. ఈ విషయాన్ని సర్వే నెంబర్ 156/1 ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతున్నట్లు రాజేంద్రనగర్ తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనికి స్పందించిన తహసీల్దార్.. అట్టి భూమిని కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు కేటాయించడం జరిగిందని, అదీ జీహెచ్ఎంసీ అధికారుల కస్టడీలో ఉందని తెలిపారు. ఇదే విషయాన్ని రాజేంద్రనగర్ డిప్యూటి కమిషనర్ దృష్టికి కమ్యూనిటి హాల్ కొరకు కేటాయించిన భూమిలో స్థానిక ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేస్తున్నారని అట్టి భూమిని కాపాడాల్సిందిగా కోరడం జరిగింది.
డిప్యూటి కమిషనర్ స్పందిస్తూ.. కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని తెలిపారు. కానీ, మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించగా జోరుగా ఇండ్ల నిర్మాణాలు 80 శాతం పనులు పూర్తికావొస్తున్నాయి. ఈ డిప్యూటి కమిషనర్ సరికొత్త కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నట్లు కనిపిస్తుంది. ‘అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడు’ అన్నట్టు ఉంది ప్రభుత్వ అధికారుల తీరు. సర్కారు ఆస్తులు, భూములను కాపాడలేని వీళ్ళు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. మైలార్ దేవులపల్లిలోని సర్వీ నెం. 156/1లో కబ్జా పెట్టిన ప్రభుత్వ భూమి విలువ సుమారు రూ.5కోట్ల వరకు ఉంటుంది అని అంచనా. ఇంత కాస్లీ భూమిని కబ్జాకోరులు కొట్టేస్తే, తహసీల్దార్, జీహెచ్ఎంసీ అధికారులు నోరు మెదపక పోవడంపై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. గవర్నమెంట్ స్థలాన్ని కొట్టేసి దాంట్లో దర్జాగా నిర్మాణాలు చేపడుతుంటే. విధులపట్ల నిర్లక్ష్యం వహించి కబ్జాలకు పరోక్షంగా సహకరించిన డిప్యూటి కమిషనర్‌పై చర్యలు తీసుకొని, అట్టి నిర్మాణాలను తొలగించి, ప్రభుత్వ స్థలాన్ని ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.