నీలం రంగు గుడ్డుతో సంచలనం
కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని చన్నగిరి తాలూకా నల్లూరు గ్రామంలో ఓ విచిత్ర సంఘటన గ్రామస్తులనే కాకుండా అధికారులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా తెల్లగుడ్లు పెట్టే నాటు కోడి ఒకటి నీలం రంగు గుడ్డు పెట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన రైతు సయ్యద్ నూర్ తన జీవనోపాధి కోసం పది నాటు కోళ్లు పెంచుకుంటున్నాడు. వాటిలో ఒక కోడి తాజాగా నీలం గుడ్డు పెట్టడంతో ఆయనే కాకుండా గ్రామమంతా ఆశ్చర్యపోయింది. విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆ గుడ్డును చూసి ముచ్చటపడుతున్నారు.
సమాచారం అందుకున్న పశుసంవర్ధక శాఖ బృందం సహాయ సంచాలకుడు డాక్టర్ అశోక్ నేతృత్వంలో గ్రామానికి చేరుకుని ఆ కోడిని, గుడ్డును పరిశీలించింది. ఆయన మాట్లాడుతూ, “కొన్ని జాతుల కోళ్లలో ఉండే ‘బైలివెర్డిన్’ అనే పిగ్మెంట్ కారణంగానే గుడ్డు పెంకు నీలం లేదా ఆకుపచ్చగా మారుతుంది. ఇది అరుదైన పరిణామం మాత్రమే. కానీ గుడ్డు రంగు మారినంత మాత్రాన పోషక విలువల్లో ఎలాంటి తేడా ఉండదు” అని వివరించారు. అయితే గ్రామస్తులు మాత్రం దీనిని అదృష్ట సంకేతంగా భావిస్తున్నారు. ఈ నీలం గుడ్డు తమ గ్రామానికి శుభం తీసుకువస్తుందని కొందరు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు భవిష్యత్తులో కూడా అదే కోడి ఇలాంటి గుడ్లను పెడితే, దానిపై లోతైన జన్యుపరమైన అధ్యయనాలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆ కోడి ఆరోగ్యాన్ని గమనిస్తూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.