Friday, July 25, 2025
spot_img

జీహెచ్ఎంసీ కమిషనర్ గారూ మీకు బాధ్యత లేదా..?

Must Read
  • రూ. 10 కోట్ల ప్రభుత్వ భూమి మాయమైనా స్పందించారా..?
  • మేము ఆధారాలిస్తున్నాం.. మౌనం ఎందుకు వహిస్తున్నారు..
  • ప్రధాన సూత్రధారి అప్పటి కాప్రా సబ్ రిజిస్ట్రార్ పై చర్యలు తీసుకోరా..?
  • ప్రస్తుతం మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ గా విధులు వెలగబెడుతున్నాడు..
  • ఒకే డాక్యుమెంట్ కు మూడు ఇంటి నెంబర్ లు జారీ చేశారు..
  • ఇంత నిర్లక్ష్య వైఖరి మీ దృష్టికి రాకపోవడం దురదృష్టం..
  • టౌన్ ప్లానింగ్ అధికారులు నిద్రబోతున్నారా..? నిద్ర నటిస్తున్నారా..?
  • జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బాధ్యతగా వ్యవహరిస్తారా..?

జీహెచ్ఎంసీ అంటే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ వ్యవస్థ.. మహానగరంలో నివసిస్తున్న నివాసితులు సత్వర న్యాయం జరిగేలా.. అన్ని పనులు ఎలాంటి అవినీతి లేకుండా చూసేలా డిజైన్ చేయబడ్డ సంస్థ.. కానీ జీహెచ్ఎంసీలో అవినీతి మురికి పేరుకుని పోయింది.. ఈ మురికిని ప్రక్షాళన చేసే దిశగా నూతన కమిషనర్ ఆర్వీ కర్ణన్ వ్యవరిస్తారని నగరవాసులు భావించారు.. ఇకమీదట అవినీతి సామ్రాజ్యానికి కళ్లెం పడుతుందని ఆశించారు.. కానీ అందరూ అనుకుంటున్నట్లు జరగడం లేదని పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ఒక భారీ అవినీతి కథనాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చింది ఆదాబ్ హైదరాబాద్.. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు.. చాలా సంతోషం.. తగిన ఎంక్వయిరీ చేసి వాస్తవాలను పంపించమని కాప్రా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.. కానీ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న సామెతగా ఈ క్షణం వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టం.. జీ హెచ్ ఎం సి కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ వ్యవహారంపై దృష్టిపెట్టాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.. ఆ వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ఈ వాస్తవ కథనాన్ని ఇదివరకే ఆదాబ్ ప్రచురించింది.. తగిన ఆధారాలు కూడా జతచేసింది.. మరోసారి అక్కడ జరిగిన అవినీతిని చూద్దాం.. వేరేవాళ్ళ ఇంటి నెంబర్ ను క్షుణ్ణంగా పరిశీలించకుండానే సబ్ రిజిస్ట్రార్ అశోక్ కుమార్ పిటిఐ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేశారు.. అనగా ఇంటినెంబర్ 1-1-14/ఏ గా చూపిస్తూ 809 గజాల భూమిని పరికిబండ జయలక్ష్మికి 3335/2016 తేదీ 20 జులై 2016 నాడు ఎంచక్కా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది..ఈ వ్యవహారం కాప్రా మున్సిపల్ పరిధిలో జరిగింది..

నమ్మశక్యం కానీ విషయం ఏమిటంటే అప్పట్లో కాప్రా సబ్ రినిస్త్రార్‌గా విధులు నిర్వహించిన అశోక్ కుమార్ కనీస అవగాహన లేకుండా.. ఎలాంటి పరిశీలన చేయకుండా.. రిజిస్ట్రేషన్ చేశాడు.. వాస్తవమైన విషయం ఏమిటంటే మున్సిపల్ రికార్డుల ప్రకారం ఈ స్థలం డి. రాజు అనే వ్యక్తికి సంబంధించినది.. అయినా కూడా సబ్ రిజిస్ట్రార్ ఏవిధంగా రిజిస్ట్రేషన్ చేశాడు అన్నది పెద్ద మిస్టరీగా మారిపోయింది.. కాగా అప్పటి కాప్రా సబ్ రిజిస్ట్రార్ అశోక్ కుమార్ ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తుండటం గమనార్హం..

అయితే ఇదే క్రమంలో సదరు పరికిబండ్ల జయలక్ష్మి తన దగ్గర ఉన్న డాక్యుమెంట్ల ద్వారా కాప్రా మున్సిపల్ అధికారులకు తనకు కొత్త డోర్ నెంబర్ కావాలని దరఖాస్తు చేసుకోవడం జరిగింది.. కాగా ఈ విధంగా దరఖాస్తు చేసుకునే ముందు సైట్ కు సంబంధించిన ఫోటో సబ్మిట్ చేయడం అన్నది నిబంధన.. కానీ అలాంటి నిబంధనలను తుంగలో తొక్కుతూ మున్సిపల్ అధికారులు ఆమెకు పాత డోర్ నెంబర్ స్థానంలో 1-1-15/1/2 గా 5-12-2017 లో పీ.ఐ.టి. నెంబర్ 1010128594 గా కేటాయించారు.. మరీ ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ముందుగా వచ్చిన డోర్ నెంబర్ నకిలీది.. ఈ నకిలీ డోర్ నెంబర్ ఉండగా మరొక డోర్ నెంబర్ కోసం దరఖాస్తుచేసుకోవడం మరీ విచిత్రం.. ఇవన్నీ ఏమాత్రం పరిశీలించకుండా మున్సిపల్ అధికారులు మరో డోర్ నెంబర్ కేటాయించడం ప్రభుత్వ చరిత్రలో ఇప్పటివరకూ జరగని వ్యవహారం.. మరి మున్సిపల్ అధికారులు ఎంత డబ్బులు తీసుకుని ఈ వ్యవహారం నడిపారో వెలుగులోకి రావాల్సి ఉంది..

ఇక జరిగిన అసలు కథ ఒకసారి పరిశీలిస్తే.. కొత్తగా వచ్చిన డోర్ నెంబర్ ఆధారంగా సదరు పరికిబండ్ల జయలక్ష్మి అనే మహిళ సంబంధిత భూమిని తన కుమారుల పేరుమీద గిఫ్ట్ డీడ్ చేసింది.. ఆమె కుమారుడైన పరికిబండ సత్యనారాయణ ప్రకాష్ అనే వ్యక్తి పేరుమీద 142. 26 గజాల భూమిని 1-1-15/1/2/3 డోర్ నెంబర్ గా చూపిస్తూ 7486/2022 గా రిజిస్ట్రేషన్ చేయించింది.. కాగా ఇదే వ్యక్తికి ఇంకొక డోర్ నెంబర్ 1-1-15/1/2/ఎన్/సి అని చూపిస్తూ 163. 88 గజాల స్థలాన్ని 1087/2023 నాడు అంటే దాదాపు ఏడాది తర్వాత గిఫ్ట్ డీడ్ గా రిజిస్ట్రేషన్ చేసింది.. ఇక తన ఇంకో కుమారుడైన పీ. బాల చరణ్ కు 130. 1 గజాల భూమిని 15-12-2022 నాడు 7485/2022 నాడు 1-1-15/1/2/3 డోర్ నెంబర్ చూపిస్తూ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది.. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2022 సంవత్సరంలో డిసెంబర్ 15 నాడు పరికిబండ సత్యనారాయణతో బాటు, పీ. బాల చరణ్ కు కూడా ఒకే డోర్ నెంబర్ తో గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది.. మరి ఇది ఎలా సాధ్యం అయ్యిందో సంబంధిత అధికారులకే తెలియాలి..

కాగా ఇన్ని అక్రమ వ్యవహారాలు ఎలా సాధ్యం అయ్యాయి అన్నది మాత్రం ఇప్పటికీ అంతుబట్టడం లేదు.. ఏ అధికారి ఎంతెంత ముడుపులు తీసుకున్నారో అన్నది ఖచ్చితంగా వెలుగులోకి రావలసిన అవసరం వుంది.. ఇంత గుడ్డిగా ఎలాంటి బాధ్యత లేకుండా అధికారులు వ్యవహరించారో చూస్తుంటే ఆశ్చర్యం కలుగక మానదు..

ఇక ఈ వ్యవహారంలో నకిలీ పత్రాలు మొదలు అయ్యింది 2003వ సంవత్సరం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. అప్పుడు రంగారెడ్డి జిల్లా, కీసర మండలం, ఓల్డ్ కాప్రా గ్రామం.. అప్పట్లో కీసర మండల్ ఎమ్మార్వోగా కే. వేదవతి విధులు నిర్వహిస్తూ ఉండేది.. ఈ క్రమంలో ఈవిడ విధులు నిర్వహిస్తున్న సమయంలో కుమ్మరి ముత్యాలు అనే వ్యక్తి సదరు ఎమ్మార్వో వేదవతి సంతకం ఫోర్జరీ చేసి, గ్రామ కంఠానికి సంబంధించిన సుమారు 809 గజాల స్థలాన్ని తనకు పొజిషన్ లోకి వచ్చినట్లు ఒక సర్టిఫికెట్ బీ/2304/2003 గా నకిలీ దస్తావేజులు సృష్టించాడు..

ఇక వేరే వారి ఇంటి నెంబర్ పరిశీలించకుండా సబ్ రిజిస్టర్ అశోక్ కుమార్ పిటిఐ నెంబర్ తో రిజిస్ట్రేషన్ అనగా ఇంటినెంబర్ 1-1-14/ఏ గా చూపిస్తూ 809 గజాల భూమిని పరికిబండ జయలక్ష్మికి 3335/2016 తేదీ 20 జులై 2016 నాడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది.. అయితే అప్పటి కాప్రా సబ్ రిజిస్ట్రార్ అశోక్ కుమార్ ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా, కనీసం అవగాహన లేకుండా రిజిస్ట్రేషన్ చేశాడు.. అయితే మున్సిపల్ రికార్డుల ప్రకారం ఈ స్థలం డి. రాజుకు సంబంధించినది అయినా కూడా సబ్ రిజిస్ట్రార్ ఏవిధంగా రిజిస్ట్రేషన్ చేశాడు అన్నది అంతుబట్టని విషయంగా మారింది.. కాగా అప్పటి కాప్రా సబ్ రిజిస్ట్రార్ అశోక్ కుమార్ ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తుండటం గమనార్హం..

ఇదంతా కూల్ గా జరిగిపోయింది.. కాగా వీరందరూ కలిసి సదరు 809 గజాల ఈ గ్రామకంఠం అంటే ప్రభుత్వ భూమిని డెవలప్మెంట్ కింద వట్టిగుంట ప్రతిమ అనే ఆవిడకు సంబంధించిన శ్రీ పంచమి డెవలపర్స్ అనే వారికి అగ్రిమెంట్ చేయడం జరిగింది.. ఈ అగ్రిమెంట్ నెంబర్ 6439/2024.. ను నాలుగు షెడ్యూల్స్ లో జరిగేలా అగ్రిమెంట్ చేసుకున్నారు.. ప్రస్తుతం ఇక్కడ నాలుగు విల్లాలు నిర్మాణం పూర్తి చేసుకుని, మరో నాలుగు విల్లాల నిర్మాణం కోసం శరవేగంగా పనులు సాగుతున్నాయి.. ఒక్కో విల్లా దాదాపు కోటి రూపాయల నుండి 2 కోట్ల రూపాయల వరకు పలుకుతోందని తెలుస్తోంది..

అవినీతి జరిగిన తీరును గమనిద్దాం :
ఓకే ఇంటి నెంబర్ పై రిజిస్టర్ అయిన స్థలానికి మరో రెండు ఇంటి నెంబర్ లు జారీ చేశారు జిహెచ్ఎంసి సర్కిల్ అధికారులు..పత్రాలను పూర్తిగా, సరైన పద్దతిలో పరిశీలించకుండా భవన నిర్మాణాలకు అనుమతి జారీ చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు.. మొదటగా రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ నకిలీది.. దురదృష్టం ఏమిటంటే నకిలీ డాక్యుమెంట్ కు వరుసగా ఇంటి నెంబర్ లు జారీ అవడం.. గ్రామకంఠం భూమి అంటే కనీసం అవగాహన కూడా లేని వ్యక్తి జగన్ డిప్యూటీ కమిషనర్ గా ఉండడం మరో దరిద్రం..కళ్ళముందు ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం రేవంత్ సర్కారుకు సిగ్గుచేటు..

ఇక కొసమెరుపు ఏమిటంటే.. ఈ వ్యవహారాన్ని అంతటినీ పక్కా సాక్షాధారాలతో సహా ఆదాబ్ హైదరాబాద్ వెలుగులోకి తీసుకుని వచ్చాక ఉన్నతాధికారుల్లో కాస్త చలనం వచ్చింది.. అసలు జరిగిన భారీ అవినీతిపై తగిన విచారణ జరిపించి.. తమకు వాస్తవాలు తెలియజేయాలని కాప్రా మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ లెటర్ రాయడం జరిగింది.. కానీ మనం ముందు చెప్పుకున్నట్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మున్సిపల్, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోవడం దురదృష్టకరం.. ఎందుకని ఉన్నతాధికారుల ఆదేశాలకు వీరు స్పందించడం లేదు..? ఉన్నతాధికారులంటే భయం లేదా..? ప్రభుత్వం అంటే లెక్కలేదా..? జీ.హెచ్.ఎం.సి. కమిషనర్ అంటే గౌరవం లేదా..? ఇవన్నీ కాకుండా అమ్యామ్యాలు పుచ్చుకుని మౌనం వహిస్తున్నారా..? రూ. 10 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని కాపాడమంటే.. లంచాలు తీసుకుని అక్రమార్కులను కాపాడేందుకు కంకణం కట్టుకున్నారా..? అన్నది తేలాల్సి ఉంది..

ఇప్పటికైనా, ఈ కథనం చూశాక అయినా ప్రభుత్వం, అలాగే జీ.హెచ్.ఎం.సి కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఇతర ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారు..? ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? అసలు కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమి పరిరక్షించబడుతుందా..? లేదా..? వేచి చూడాల్సిందే..

Latest News

పాఠశాల కూలి ఏడుగురు మృతి

రాజస్థాన్‌లోని ఝూలవర్‌ లో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఝూలవర్‌ జిల్లా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS