కుమారుడికి ప్రాణాపాయం తప్పడంతో మొక్కులు
ఏపీ డిప్యూటీ- సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత అన్నా లెజినోవా అఖిలాండం వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద తితిదే అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. తమ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడటంతో అన్నా లెజినోవా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. స్థానిక గాయత్రీ నిలయంలో ఆమె బస చేశారు. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ.. తొలుత ఆమె శ్రీభూవరా హస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీపద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అన్యమతస్థురాలు కావడంతో మొదట అతిథిగృహంలో డిక్లరేషన్‌పై సంతకం చేశారు.






