అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు ఈ నెల 15న అలస్కాలో సమావేశం కానున్నారు. భేటీకి గంటల ముందే ట్రంప్ పుతిన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, రెండో దఫా ఆంక్షలు విధించే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీతో పాటు పలు యూరోపియన్ నేతలతో వర్చువల్ సమావేశం అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, చర్చలు సవ్యంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భేటీ సత్ఫలితాలిస్తే జెలెన్‌స్కీని కలుపుకొని మరో రౌండ్ సమావేశం నిర్వహించే యోచన ఉందన్నారు.
వైట్‌హౌస్ వర్గాల ప్రకారం, అలస్కాలో జరిగే ఈ సమావేశం అత్యంత గోప్యంగా ఉంటూ, ఇరువురు నేతలు, వారి అనువాదకులు మాత్రమే హాజరవుతారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ముఖాముఖి చర్చపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ట్రంప్, పుతిన్ భేటీపై స్పందించిన జెలెన్‌స్కీ, ఉక్రెయిన్‌లో శాంతి కోసం ప్రపంచ నేతలు ఏకమై ఉన్నారని పేర్కొన్నారు. పుతిన్ సరిహద్దుల్లో యుద్ధాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, కాల్పుల విరమణకు అంగీకరించకపోతే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని కోరారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ఆంక్షల ప్రభావంతో రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని, యుద్ధం ఆగే అవకాశం ఉంటుంది.