సంగారెడ్డి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ ఆలయం వరుసగా ఆరో రోజూ వరద జలాల్లో మునిగిపోయింది. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా నీరు విడుదల కావడంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా ఆలయ ప్రాంగణం మొత్తం వరద నీటితో నిండిపోయింది. ఆలయం వద్ద వనదుర్గ ఆనకట్టపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు నేరుగా ఆలయ గర్భగుడిలోకి చేరి అమ్మవారి పాదాలను తాకుతూ రాజగోపురం ముందు నుంచి వెళ్ళిపోతోంది. దీంతో ఆలయంలోకి భక్తులను అనుమతించడం సాధ్యం కాకపోతోంది. వరుసగా ఆరు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
భక్తుల దర్శనం కోసం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురం వద్ద ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు అక్కడి నుంచే అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న గర్భగుడి, ఆనకట్ట వైపుకి ఎవరు వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.