- కోట్ల రూపాయల విలువైన ఎండోమెంట్ భూములు మాయం
- అనుమతులు ఒకచోట.. నిర్మాణం మరోచోట
- తప్పుడు పర్మిషన్లు ఇచ్చిన మున్సిపల్ అధికారులు
- మాముళ్ల మత్తులో అధికార యంత్రాంగం
- మణికొండ అధికారులపై తీవ్ర ఆరోపణలు
- పట్టించుకోని ఎండోమెంట్ కమిషనర్..
- మున్సిపల్ కమిషనర్ ఉన్నట్టా లేనట్టా..
- దేవుడి మాన్యాన్ని కాపాడలంటున్న స్థానికులు
ప్రభుత్వాలు మారినా, కఠిన చట్టాలు వచ్చినా అవినీతి అధికారుల తీరు మారడం లేదు. ప్రభుత్వ ఆస్తులను, చట్టాలను కాపాడాల్సిన అధికారులే స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమార్కులతో చేతులు కలిపి ప్రభుత్వ భూములను, దేవుడి మాన్యాలను సైతం వదలడం లేదు.
వివరాల్లోకి వెళితే: రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ మండలం, నెకనామ్‌పూర్ గ్రామ పరిధిలోని కోట్ల రూపాయల విలువైన ఎండోమెంట్ భూములు అక్రమార్కుల చేతిలో చిక్కుకుపోవడంపై మణికొండ మున్సిపల్ మరియు ఎండోమెంట్ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమగ్ర నివేదికలు ఉన్నప్పటికీ, అధికారులు స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
భూముల వివరాలు: నెకనామ్‌పూర్ గ్రామ సర్వే నెం. 112, 116, మరియు 125 లో ఉన్న మొత్తం 28.25 ఎకరాల ఎండోమెంట్ భూమిని గతంలో ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు ఒక బృందం సర్వే చేసింది. ఈ బృందంలో చంద్రశేఖర్ (అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్), అనిత ఎస్పీఎల్ డిప్యూటీ కలెక్టర్, హరిత (తహసీల్దార్), రాజశేఖర్ (ఇన్ స్పెక్టర్ ఆఫ్ హైడ్రా), వి.రాము (సర్వే ఎక్స్ పర్ట్ టీమ్ లీడర్), ఆర్. సత్యబాబు (రెవెన్యూ ఎక్స్ పర్ట్), సతీష్ రెడ్డి (సర్వేయర్), అరుణ కుమారి (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గణేష్ టెంపుల్ నెకనామ్‌పూర్) ఉన్నారు.

డిప్యూటీ కలెక్టర్ మరియు తహసీల్దార్, రాజేంద్రనగర్ మండలం, 2016 సెప్టెంబర్ 6న విడుదల చేసిన ప్రొసీడింగ్స్ నెం. డి/1350/2015 ప్రకారం, ఈ సర్వే నంబర్లలోని భూములు ఎండోమెంట్ చట్టం సెక్షన్ 6(ii) క్రింద ప్రచురించబడ్డాయి. ఈ భూములు ఎండోమెంట్ భూములని, అవి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయబడ్డాయని స్పష్టంగా ధృవీకరించబడింది. సర్వే నెం. 116లో 13.24 ఎకరాలు, సర్వే నెం. 112లో 11.03 ఎకరాలు, మరియు సర్వే నెం. 125లో 3.27 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు.
అధికారుల అండతో అక్రమాలు: మణికొండలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో, అక్రమార్కుల కన్ను దేవుడి మాన్యంపై పడింది. మణికొండ మున్సిపల్ అధికారులు, బడాబాబులు విసిరిన ప్రలోభాలకు లొంగి, సర్వే నంబర్ 116 లో నిర్మాణ అనుమతులు ఇచ్చి, పక్కనే ఉన్న 117 సర్వే నంబరును పర్మిషన్ పత్రాల్లో నమోదు చేశారని ఆరోపణలున్నాయి. అయితే, క్షేత్రస్థాయి పరిశీలనలో వారు ఇచ్చిన అనుమతులు సర్వే నంబర్ 116 కు సంబంధించినవేనని స్పష్టమవుతోంది.
మణికొండ మున్సిపల్ కమిషనర్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు స్వార్థ ప్రయోజనాల కోసం కలెక్టర్ ఆదేశాల మేరకు సంయుక్తంగా సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలతో కూడిన నివేదికలు సమర్పించినప్పటికీ, ఆ నివేదికలను పక్కనపెట్టి అవినీతికి పాల్పడటం అత్యంత శోచనీయం. కోట్ల రూపాయల విలువ గలిగిన దేవుడి మాన్యాన్ని రక్షించాల్సిన ఎండోమెంట్ అధికారులు నిర్లక్ష్యం వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దోషులను కఠినంగా శిక్షించాలి: స్థానిక ప్రజలు
స్థానిక ప్రజలు తక్షణమే ఎండోమెంట్ కమిషనర్ స్పందించి, నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దేవుడి మాన్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా, స్వార్థ ప్రయోజనాల కోసం ఎండోమెంట్ భూమిలో తప్పుడు సమాచారంతో భూ అక్రమార్కులకు నిర్మాణ అనుమతులు ఇస్తున్న కమిషనర్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులపై కలెక్టర్ మరియు సీడీఎంఏ (కమీషనర్ & డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతైన దర్యాప్తు జరిపి, దోషులను శిక్షించి, దేవుడి ఆస్తులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది.. ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..