Tuesday, January 28, 2025
spot_img

రియల్టర్ల చెరలో ఎర్రగుంట్ల వాగు

Must Read
  • సురంగల్‌ వాగుకు అటు, ఇటు మేమే..
  • మా వెంచర్‌లోకి వచ్చిన వాగును పూడ్చేస్తాం.. అది మా ఇష్టం
  • ఇక్కడ జడ్జిలున్నరు, పోలీస్‌ అధికారులున్నారంటున్న రియల్టర్లు
  • మమ్మల్ని ప్రశ్నిస్తే అంతే సంగతంటూ అధికారులకు అల్టిమేటం
  • తుంగలోకి 111జీవో.. కనుమరుగైన సహజ వాగు..
  • 30ఎకరాల చుట్టూ భారీ కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం
  • ఎంపీవో, పంచాయతీ సెక్రటరీ కుమ్మక్కు
  • అవినీతిలో రెవెన్యూ శాఖను మించిపోయిన ఇరిగేషన్‌ శాఖ
  • మాముళ్లు తీసుకొని వెంచర్‌ నిర్వాహకులకు ఫుల్‌ సఫోర్ట్‌
  • ఉన్నతాధికారులు బాద్యులపై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్‌

పాలకులు మారిన, కొత్త ప్రభుత్వాలు వచ్చినా, అధికారులు ట్రాన్స్‌ఫర్స్‌ అవుతున్నా ఏం ఆట అంటే ఎప్పటి ఆటలానే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. భూములు సాగుచేసుకునే రైతులను రియల్టర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఏళ్ల క్రితం నుంచి ఉన్న చెరువులు, కుంటలు, వాగులను పొతం పెట్టే పనిలో అక్రమార్కులు ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్‌ సహా చుట్టూ ఉన్న రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాలలో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో భూబకాసురులు ఎక్కడ, ఏం ఖాళీగా కనిపించిన కబ్జాచేసే పనిలో పడుతున్నారు. వ్యవసాయ భూములను అత్తెసరుకు కొనుగోలు చేస్తున్న రియల్టర్లు వెంచర్లు చేసి కోట్ల రూపాయలు గడిస్తున్నారు. చెరువులు, కుంటలు, సహజ వాగులను కొల్లగొట్టి వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు మాముళ్లు ముట్టచెబుతూ అక్రమార్కులు తమ పని కానిచేస్తున్నారు. ‘ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా?’ అన్నట్టుగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఉన్నతాధికారులే పెద్ద పెద్ద స్కామ్‌ లు చేస్తుండగా మేం చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఏముందిలే అనుకుంటున్నారు. పొలిటికల్‌, పైసల పలుకుబడితో యధేచ్చగా రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో రియల్టర్లు చెరువులు, వాగులను అర్థాంతరంగా చంపేస్తున్నారు. బోర్లు, బావులు లేకుండా సహజంగా పారే నీటి ద్వారా పంట సాగుచేసుకునే కర్షకులు నేడు కన్నీరు పెడుతున్నారు. గత బీఆర్‌ఎస్‌ హయాంలో అక్రమాలు, అవినీతిని చూడలేకనే కాంగ్రెస్‌ పార్టీకి ఓటువేసి గెలిపించుకుంటే, వీళ్లు అంతే పాడైనారని గగ్గోలు పెడుతున్నారు. రేవంత్‌ సర్కార్‌ హయాంలో జరుగుతున్న అకృత్యాలను జూసి 111 జీవో పరిధిలో ఉన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పంటపొలాల మధ్య సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ వెంచర్‌ను ఏర్పాటుజేసిన, అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. లక్షలాది రూపాయలకు వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి గుంటలల్లో రిజిస్ట్రేషన్లు జేస్తూ విల్లాలను దర్జాగా విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం గుడ్డి గుర్రం పన్లు తోముతుందా అని స్థానికులు నిలదీస్తున్నారు. ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి, ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖ సిబ్బంది అంతా కూడ పలుకుకొని రియల్టర్లు వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని పర్మిషన్లు ఇచ్చి వెంచర్లు చేసేందుకు సహకరిస్తున్నారని స్థానిక అన్నదాతలు ఆరోపిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం సురంగల్‌ గ్రామ పంచాయతీ రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 271, 276, 281 లోగల వ్యవసాయ భూమిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సుమారు 30 ఎకరాలలో అక్రమ వెంచర్‌ ను ఏర్పాటు చేశారు. సదరు వెంచర్‌ నిర్వాహకులు తద్వారా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇప్పటికే ఇరిగేషన్‌ అధికారులు, సంబంధిత ఎంపీడీవో, రెవిన్యూ అధికారులు నోటీసు ఇచ్చినా పనులు ఏ మాత్రం ఆగలేదు. కూల్చివేతలకు నోటీసులిచ్చినా రాత్రి సమయాలలో అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తూ అధికారులకు సవాల్‌ విసురుతున్నారు. ఈ వెంచర్‌ లో జడ్జీలు, పోలీసు అధికారులున్నారు అంటూ వెంచర్‌ నిర్వాహాకులలో ఒకరైన వెంకటరెడ్డి బెదిరింపులకు గురిచేస్తున్నారు. కూల్చివేతలకు నోటీసులిచ్చి కూల్చివేతలకు ఉపక్రమించిన అధికారులకు రియల్టర్లు అల్టిమేటం ఇస్తున్నారు. కాగా ఇప్పటివరకూ ఎలాంటి నాలా కన్వర్శన్‌, లే అవుట్‌ పర్మిషన్లు గానీ లేకుండానే విల్లాలు విక్రయించేస్తున్నారు. అంతేకాకుండా గుంటలలో రిజిస్ట్రేషన్‌ కావడం వెనుక ఆంతర్యమేంటని స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు. నేను కొట్టినట్టు చేస్త నువ్వు ఏడ్చినట్టు నటించు అన్నట్టుగా ప్రభుత్వ అధికారులు వెంచర్‌ నిర్వాహకుల వద్ద మాముళ్లు తీసుకొని వారికి సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.

‘ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు’ అన్న చందంగా ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకొని అక్రమ వెంచర్‌ నిర్వాహకులకు పూర్తిగా సహకరిస్తున్నారు. ఇదే విషయమై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నోరు మెదపడం లేదు. అక్రమ నిర్మాణాలు యధేచ్చగా సాగుతుండడం వెనుక పలు అనుమానాలకు తావిస్తోందని రైతులు వాపోతున్నారు. స్థానిక ఎంపీవో, ఇరిగేషన్‌, రెవిన్యూ అధికారులు సర్వే చేసి రిపోర్టు ఇచ్చినా ఇంత వరకు చర్యలు శూన్యం. తాము ఎన్నిసార్లు కంప్లైంట్‌ చేసిన, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు రిపోర్ట్‌ అందజేసిన ఇప్పటి వరకు చర్యలు తీసుకోపోవడంతో మండల పరిషత్‌ అధికారులపై పలు అనుమానాలు సర్వత్ర వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల క్రితం నుంచి ఉన్న ఎర్రగుంట్ల వాగును కబ్జాచేసి సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్‌ నిర్మాణం చేస్తూ సహజ వాగును బాజాప్తా చంపేస్తుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్‌ చేస్తుంటే అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఎంపీవో మరియు కార్యదర్శిలు విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో డీఎల్‌పీవో మెమో జారీ చేసినట్లు తెలుస్తుంది. జడ్జీలు, పోలీసు అధికారులు ఉన్నారని నమ్మబలుకుతూ గుంటకో బోరు చొప్పున 20 బోర్లు వేసిన అక్రమ వెంచర్‌ దారులపై, లంచాలు తీసుకొని వాళ్లకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ను బాధిత రైతులు వేడుకుంటున్నారు.

Latest News

రైతు ఖాతాల్లోకి రైతు భరోసా జమ

రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది ఖాతాల్లోకి నగదు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ చేసే పక్రియ కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS