- ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలు శూన్యం …
- అమ్యామ్యాల సొమ్ముతో గోవా టూర్ కి ప్లాన్ వేసిన సిబ్బంది
- డైరెక్టర్ ని వివరణ కోరగా తనకేమి తెలియదని బుకాయింపు
- నిబంధనలను నిలువునా పాతరేసి ఇష్టానుసారంగా పనులు
- ప్రమాదాలు జరుగుతున్నా.. పట్టించుకోని ఫ్యాక్టరీస్ డైరెక్టర్
- తూ..తూ.. మంత్రంగా తనిఖీలు..పిర్యాదులు చేస్తే .. సైలెన్స్
- గిట్టనివాళ్ళ చెప్పుడు మాటలంటూ కోట్టి పారేస్తున్న వైనం
- వెతికినా దొరకని పరిశ్రమల చిరునామాలు, ఫోన్ నంబర్లు
- యధా రాజు.. తదా ప్రజా మాదిరిగా కార్యాలయంలో పనులు
తెలంగాణ రాష్ట్రంలో ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ అధికారుల పనీతీరు అస్తవ్యస్తంగా తయారయ్యింది.. పరిశ్రమలలో ఉన్న లోపాల కారణంగా తరుచు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాటి నివారణకు అధికారులు చర్యలు చేపట్టకపోవడం వారి అసమర్ధతకు పరాకాష్టగా మారింది.. మీ పని తీరు బాగాలేదని.. ఇటీవల ఫ్యాక్టరీలలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిపై ఎం చర్యలు తీసుకుంటున్నారని ఫ్యాక్టరీస్ అఫ్ డైరెక్టర్ బెండి రాజగోపాల రావును ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి వివరణ కోరగా అది మాపై గిట్టనివాళ్లు చెప్పిన కట్టుకథగా వారు చెప్పడం విశేషం.. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.. వాటి నియంత్రణకు అధికారులు తీసుకున్న చర్యలు శూన్యం గానే చెప్పవచ్చు.. కనీసం ప్రమాదాలపై సమీక్షలు జరిపిన దాఖలాలు మచ్చుకైనా లేవు.. పరిశ్రమలను సందర్శించి భద్రతకు సంబంధించి చర్యలు చేపట్టవలసిన ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు తూ తూ మంత్రంగా విధులను నిర్వర్తించడం వలన ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.. పరిశ్రమలను సందర్శించకుండానే అధికారులు ఇష్టానుసారంగా సందర్శించినట్లు రాసుకొని కార్యాలయం లోనే పరిశ్రమల యజమాన్యాలకు ధృవీకరణ పత్రాలు ఇస్తున్నట్లు సమాచారం.. అదే సమయంలో వసూళ్ల విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్లు మామూళ్ల మత్తులో ఊగుతున్నారని చెప్పుకుంటున్నారు.
అమ్యామ్యాల డబ్బులతో గోవా టూర్‌కి ప్లాన్ వేసిన సిబ్బంది :
ఇటీవల రాష్ట్ర స్థాయి కార్యాలయంలోని అధికారులు పరిశ్రమలను సందర్శించకుండానే సందర్శించినట్లు సంబంధిత పరిశ్రమల యజమాన్యాలకు ధృవీకరణ పత్రాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు గాను పరిశ్రమల నిర్వాహకులు కొంత నజరానాను ముట్టజెప్పినట్లు సమాచారం.. ఈ డబ్బులతో వారు టీమ్ గా ఏర్పడి గోవాకి టూర్ వెళ్లాలని ప్లాన్ వేసుకున్నట్లు తెలిసింది.. ఈ విషయాన్నీ ఫ్యాక్టరీస్ అఫ్ డైరెక్టర్ బెండి రాజగోపాల రావు దృష్టికి తీసుకెళ్తే వారు నిజంగా తనకు ఏమి తెలియదని వివరణ ఇచ్చారు.. కింది స్థాయి సిబ్బంది ఏమి చేస్తున్నారో తెలుసుకోలేని నిస్సహాయత స్థితిలో డైరెక్టర్ ఉన్నప్పుడు కార్యాలయ పనితీరు ఎలా ఉంటుందో ఇట్టె అర్ధం చేసుకోవచ్చు..
పరిశ్రమలలో భద్రతను గాలికి వదిలేసినట్లు ఫ్యాక్టరీస్ ఆఫ్ డైరెక్టర్ తన కార్యాలయాన్ని పట్టించుకోకపోవడంతో కింది స్థాయి సిబ్బంది ఆడింది ఆటగా.. పాడింది పాటగా నడుస్తోంది.. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి తప్ప పెద్దగా అధికారులు చేపడుతున్న చర్యలు లేవని చెప్పుకుంటున్నారు..
నివేదికలకు లక్షల రూపాయల వసూళ్లు :
ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదాలకు సంబంధించిన రిపోర్టు తీసుకోవడానికి పరిశ్రమల నిర్వాహకులు అష్టకష్టాలు పడుతున్నారు.. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా తయారయ్యింది పరిశ్రమల నిర్వాహకుల పరిస్థితి.. ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ అధికారులు పరిశ్రమలలో జరిగిన ప్రమాదాలకు సంబంధించి రిపోర్టు ఇవ్వాలంటే లక్షల రూపాయల ముడుపులు ఇస్తేనే ప్రమాదం జరగడంలో యజమాన్యాల నిర్లక్ష్యం లేదని రిపోర్టు వస్తుంది లేదంటే యజమాన్యం నిర్లక్ష్యం మూలంగా ప్రమాదం జరిగిందని ఇస్తామని యజమాన్యాలను బహిరంగంగానే వేధిస్తున్నారని సమాచారం.. దాంతో ఒకవైపు పరిశ్రమలో ప్రమాదం జరిగి దుర్భర పరిస్థితులలో ఉంటే అధికారులు లక్షల రూపాయలు ఇవ్వాలని వేధింపులతో వేగలేక అప్పుచేసయినా అధికారులకు ముడుపులు ఇచ్చి రిపోర్టులు అనుకూలంగా తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఉదాహరణ : సంగారెడ్డి జిల్లాలో ఎస్బి ఆర్గానిక్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు మృతి చెందారు.. ప్రమాదానికి సంబంధించి అన్ని శాఖల నుండి రిపోర్టులు రావడానికి యజమాన్యం 35 లక్షలవరకు ఖర్చు చేసినట్లు సమాచారం. అన్నిస్థాయిలో ముడుపులు ఇచ్చే వరకు రిపోర్టులు ఇవ్వలేమని ప్యాక్టరీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ అధికారులు బహిరంగంగానే చెప్పడం విశేషం..