Sunday, March 23, 2025
spot_img

దేవాదాయశాఖ‌ల్లో న‌కిలీల జోరు

Must Read
  • నకిలీ సర్టిఫికేట్ ల‌తో అర్హత లేకుండా పదోన్నతులు
  • ఫేక్ స‌ర్టిఫికేట్ల‌పై విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ ఎంక్వైరీ
  • ప‌ట్టించుకోని దేవాదాయ శాఖ అధికారులు
  • ఏసీబీలో ప‌ట్టుబ‌డ్డ వారికి ఫోక‌ల్ ఫోస్టింగ్
  • 20 ఏళ్లైనా సీనియార్టీ లిస్ట్‌ను ఖ‌రారు చేయని ఎండోమెంట్ శాఖ‌
  • హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను ప‌ట్టించుకోని క‌మిష‌న‌ర్‌
  • క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్లిన న్యాయం జ‌ర‌గ‌లేదంటున్న ఉద్యోగ‌స్థులు

తెలంగాణలో అవినీతి లేని డిపార్ట్ మెంట్ ఏదీ లేదు. పైసల కోసం కక్కుర్తి పడి కొందరూ తోటి వారికే అన్యాయం చేస్తున్నారు. ఉద్యోగస్తుల్లో కూడా పొరపచ్చాలు, భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. ప్రభుత్వాలు, పాలకులు మారినప్పుడు అధికారులు అటు ఇటు ట్రాన్స్ ఫర్ అవుతున్నా కానీ, అవినీతిపరుల్లో మార్పులు రావట్లేదు. ‘ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతుగా ఆర్నెల్లు బతకడం మేలు’ అని పెద్దలు అన్నట్టుగా ఆఫీసర్లు మారట్లేదు. దేవాదాయ ధర్మదాయ శాఖలో కొందరు నకిలీ సర్టిఫికేట్లతో కొలువు చేస్తున్నారు. రాష్ట్రంలో డబ్బులిస్తే ఏ పని అయినా జరుగుతుంది. ఎలాంటి అర్హత లేకుండా పదోన్నతులు కల్పిస్తున్నారు. 20 ఏళ్లైనా ఎండోమెంట్ అధికారులు సీనియార్టీ లిస్ట్‌ను ఖ‌రారు చేయడం లేదు. క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్లిన ఉద్యోగ‌స్థులకు న్యాయం జ‌ర‌గ‌డం లేదంటున్నారు.

వేములవాడ ఆలయంలో ఏఈవో నకిలీ సర్టిఫికేట్ కలిగి ఉన్నారని ఆలయ ఈఓ సస్పెండ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత జరిగినా.. ఇప్ప‌టి వరకు ఉన్నతాధికారులు శాఖ‌ పరమైన చర్యలు తీసుకోలేదు. ఇతర ఉద్యోగులు కూడా ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నాయని అనేక ఫిర్యాదులు వచ్చిన ఎటువంటి చర్యలు లేవు. కమిషనర్ కార్యాలయం, డిప్యూటీ కమిషనర్ కార్యాలయం, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో నకిలీ సర్టిఫికేట్ ల‌తో అర్హత లేకుండా పదోన్నతులు పొందిన ఉద్యోగ‌స్తుల‌పై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా విచారణ జ‌రుగుతున్న‌ది. అయినా దేవాదాయ ధ‌ర్మ‌దాయ శాఖ అధికారులు మాత్రం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా నిమ్మ‌కు నీరేత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అదేవిధంగా న‌కిలీ స‌ర్టిఫికేట్ ఉద్యోగ‌స్తుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన ఉన్న‌తాధికారులు నిర్ల‌క్ష్యం చేస్తున్నారు. దీంతో తోటి ఉద్యోగ‌స్థులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కొంత మంది ఉన్న‌తాధికారులు వారి అనుయాయుల‌పై ఉద్దేశ పూర్వ‌కంగా ఎలాంటి విచార‌ణ చేప‌ట్ట‌కుండా అడ్డుప‌డుతున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

వాస్తవానికి అవినీతి నిరోధ‌క శాఖ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డ ఉద్యోగ‌స్తుల‌కు నాన్ ఫోక‌ల్ పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, కొంద‌రు అధికారులు స్వార్థ ప్రయోజ‌నాల కోసం వారికి కీల‌క‌మైన బాధ్య‌త‌ల‌ను అప్ప‌జెప్ప‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తుంది. పైకం అంజ‌నారెడ్డి గ్రేడ్-1 ఈవో ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోని దుర్గా భ‌వానీ ధ‌ర్మ‌శాల‌లో పోస్టింగ్‌ను పొందారు. గ‌తంలో ఇత‌గాడు అనిశా అధికారుల‌కు హైద‌రాబాద్‌లోని పెద్ద‌మ్మ‌గుడిలో ఓ పంతులు
నుండి లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డి స‌స్పెండ్ కావ‌డం జ‌రిగింది. అయినా కూడా నియ‌మ‌ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించి, హైద‌రాబాద్‌లోని కీల‌క‌మైన బాధ్య‌త‌లు ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాకుండా ఏసీబీలో ట్రాప్ అయిన ఉద్యోగ‌స్తుల‌కు ప్ర‌మోష‌న్ ఇచ్చే ఆలోచన‌లో కొంద‌రు అధికారులు ఉండ‌టం చూస్తే ఎన్ని అవకతకలు జరుగుతున్నయో అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు ఎండోమెంట్స్ విభాగంలో వివిధ కేడర్‌లలో ఖాళీ పోస్టులు ఉన్నప్పటికీ ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ వివిధ కేడర్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు సీనియారిటీ ఖరారు చేయకుండా, ప్రమోషన్స్ ఇవ్వకుండా నేటి వరకు తాత్సారం చేస్తున్నారు. నవ్విపోదువు గాక నాకు ఏంటి సిగ్గు అన్నట్టుగా వ్యవహరిస్తూ.. ఇంఛార్జ్‌ల‌తో పాల‌న కొన‌సాగిస్తున్నారు. ఇంఛార్జ్ అధికారుల నిర్ల‌క్ష్యంతో కోట్ల రూపాయ‌ల విలువైన దేవుడి మాన్యాన్ని కాపాడ‌లేక‌పోతున్నారు. సుమారు 20 ఏళ్ల నుండి ఇంఛార్జీల ఆధ్వర్యంలోనే పాల‌న కొనసాగుతుందంటే వ్య‌వ‌స్థ ఎంత లోప‌భూయిష్టంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

‘అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరాక గూదనారాయణ’ అన్నట్టుగా ఉంది అధికారుల తీరు. 20 ఏళ్లు గ‌డుస్తున్న ఉద్యోగుల సీనియార్టీని నిరార్థించ‌కపోవ‌డం విస్మ‌యం క‌లిగిస్తుంది. రాజ‌కీయ ఒత్తిడిల‌కు దేవాదాయ శాఖ ఉన్న‌తాధికారులు ఆల‌య ఈవోల‌ను త‌మ ఇష్టానుసారంగా బ‌దిలీలు చేస్తున్నారు. అనువైన వారికి పోస్టింగ్ లు ఇచ్చి, దేవాదాయ ఆస్తుల‌ను కొల్ల‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జీవో ఎంఎస్ నెం.317 క్రింద కొందరు ఉద్యోగులు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా స్వ‌లాభం కోసం పోస్టింగ్ లు మరియు బదిలీలు చేశారు. ఈ విష‌యం కొంద‌రు అధికారులు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లకుండానే ప్ర‌భుత్వం ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను సైతం భేఖాత‌ర్ చేస్తున్నారు. జీవో ఎంఎస్ నెం.5 ప్ర‌భుత్వాన్ని మ‌భ్య‌పెట్టి కొంద‌రు దేవాదాయ శాఖ ఉద్యోగులు పై అధికారుల స‌హాయంతో ఎలాంటి నోటీసులు లేకుండా దేవాదాయ శాఖ ఉద్యోగ‌స్తుల క్యాడ‌ర్ స్టెంత్‌ను మార్చారు. జీవో ఎంఎస్ నెం.5పై ఇత‌ర ఉద్యోగులు కూడా హైకోర్టును ఆశ్ర‌యించారు.

‘అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడు’ అన్నట్టుగా ఈ జీవో వ‌ల్ల అన్యాయం జ‌రుగుతుంద‌ని తీవ్ర మ‌న‌స్తాపంతో బాధాప‌డుతున్నారు. జీవో ఎంఎస్ నెం.5 వ‌ల్ల న‌ష్ట‌పోతున్నామ‌ని అనేకసార్లు క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్లిన న్యాయం జ‌ర‌గ‌లేద‌ని ఉద్యోగ‌స్థులు వాపోతున్నారు. ఉన్న‌త న్యాయ‌స్థానం ఓ ఉన్న‌తాధికారికి రివ‌ర్ష‌న్ చేయ‌మ‌ని ఉత్త‌ర్వులు జారీ చేసిన నేటి వ‌ర‌కు క‌మిష‌నర్ ఉత్త‌ర్వులు అమ‌లు చేయ‌కుండా నిర్ల‌క్ష్యం వ‌హించ‌డంతో ప్ర‌మోష‌న్ పొందాల్సిన ఉద్యోగ‌స్థుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయశాఖలో ఉద్యోగ‌స్థుల‌కు జ‌రుగుతున్న అన్యాయంపై ఆ శాఖ మంత్రి కొండ సురేఖ‌, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ దృష్టి సారించి వారికి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్ట వాటిల్లే ప్రమాదం

కావాలనే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర వివక్ష : మాజీ మంత్రి కేటీఆర్‌ కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో కక్షపూరిత ధోరణితో దక్షిణాది రాష్ట్రాలపై అవలంబిస్తుందని మాజీమంత్రి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS