క్రికెటర్లకు తప్పిన ముప్పు
వేసవి కాలంలో పలు అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వరుస అగ్నిప్రమాదాలతో నగరం ఉలిక్కిపడుతోంది. ఇప్పుడు తాజాగా ఓ ప్రముఖ హోటల్‌లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో హోటల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. నగరంలోని బంజారాహిల్స్ పార్క్‌హయత్‌లో సోమవారం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. పార్క్‌హయత్‌లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు అలముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది త్వరితగతిన మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది… మంటలు ఏ విధంగా అంటుకున్నాయి అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. అయితే పార్క్‌హయత్ హోటల్‌లోనే హైదరాబాద్ సన్‌రైజర్ టీం బస చేస్తోంది. ఈ హోటల్‌లోనే ప్రమాదం జరగడంతో అభిమానులు ఒకింత భయాందోళనకు గురయ్యారు. కానీ సన్‌రైజర్ టీంకు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ప్లేయర్లు అంతా సేఫ్‌గా ఉన్నారని హోటల్ సిబ్బంది తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.