- కోర్టు ఉత్తర్వులను కూడా లెక్క చేయని సదరు వ్యక్తి
- న్యాయం అంటే లెక్కలేదు చట్టం అంటే గౌరవం లేదు
- కష్టపడి కొనుక్కున్న భూములను లాక్కుంటున్న వైనం
- దొంగలకు సద్దులు మోస్తున్న కొంతమంది అధికారులు
- కొండకల్ రేడియల్ రోడ్డుకు భూములు అమ్ముకున్నారు
- ప్రభుత్వం ఇచ్చే పరిహారం కూడా తీసుకున్నారు
- రికార్డుల్లో మారకపోవడం వల్ల మళ్లీ రెచ్చిపోతున్నారు
- అధికారుల అలసత్వం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు
- పట్టేదారుల అనుమతి లేకుండానే హోర్డింగుల ఏర్పాటు
- కాసుల కక్కుర్తి పడి అనుమతులు ఇస్తున్న పంచాయతీ కార్యదర్శి ఎల్లయ్య
తెలంగాణ రాష్ట్రంలో భూమాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కాపాడాల్సిన అధికారులు కూడా కాసులకు అలవాటు పడి సైలెంట్ గా ఉండడం చూస్తుంటే కంచె చేను మేసే చందంగా తయారయింది తెలంగాణ రాష్ట్రం. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ప్రాంతాల్లో ఇలాంటి అరాచకాలు నిత్యం ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. కొందరు అధికారుల కాసుల కక్కుర్తి పడుతున్నారు.. భూ కబ్జాదారుల భూదాహంతో కోట్ల రూపాయల భూమి స్వాహా చేస్తున్నారు. ఆక్రమణలను గుర్తించిన తర్వాత కూడా అధికారులు చర్యలు తీసుకోకపోగా.. తిరిగి ఆక్రమణదారులకే ఆ భూములను కట్టబెట్టబోతుండటం చూస్తుంటే రాష్ట్రంలో కొంతమంది అవినీతి ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఎలా ఉందో అర్థమవుతుంది. ఆక్రమణలు చేస్తున్న వారిలో ఎక్కువ శాతం ప్రజా ప్రతినిధులుగా చలామణి అవుతున్న వారే ఉన్నారు. వారు చేస్తున్న ఆర్థిక దోపిడీకి కొంత మంది అవినీతి అధికారులు తోడయ్యారు.
అసలు వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలో ఎన్నో భూ కబ్జాలు చోటుచేసుకుంటున్నాయి. గ్రామంలో తాజా మాజీ ఉప సర్పంచ్ గా ఉన్న కడిమోని భూపాల్ మరియు అతని సోదరుల ఆగడాలు పెచ్చు మీరుతున్నాయి. వారికి తోడు అక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శి ఎల్లయ్య లీలలు ఎన్నెన్నో.. ఆయన ఇచ్చిన ఎన్‌ఓసి సర్టిఫికెట్ల వల్ల నిజమైన పట్టేదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. నాలా కన్వర్షన్ లేకుండానే కమర్షియల్ బిల్డింగ్ లకు, వ్యాపారాలకు, వ్యాపార ప్రకటనల హోర్డింగులకు ఎన్‌ఓసీలు ఇవ్వడం చూస్తుంటే అతగాడి ధైర్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా భూములు బై నెంబర్ తో రిజిస్టర్ పట్టా భూములు ఉన్నా కూడా అతను మాత్రం బై నెంబర్ లేకుండా సర్వే నెంబర్ వేసి ఒకటే నెంబర్ మీద నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇస్తున్నాడు. ఉన్నతాధికారులను చేతిలో పెట్టుకొని వారికి కావలసిన ముడుపులు వారికిస్తూ తనకు కావాల్సినంత తను తీసుకుంటూ ఆక్రమార్కులకు వంత పాడుతున్నారు.
విషయానికొస్తే కొండకల్ గ్రామంలోని సర్వే నెంబరు 398లో గతంలో కొంతమంది భూములు కొనుగోలు చేశారు. వాటిపై మాజీ ఉప సర్పంచ్ కడిమోని భూపాల్ కన్ను పడింది. ఇంకేముంది అసలు కథకు తెర లేపాడు. ప్రభుత్వం 2018లో కొండకల్ 100 ఫీట్ రేడియల్ రోడ్డు కోసం భూ సేకరణ చేపట్టింది. అయితే ఇందులో భూములు కోల్పోయిన వారికి పరిహారం కూడా చెల్లించింది 398లో కడిమోని భూపాల్ కుటుంబానికి చెందిన భూములు ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భాగంగా భూములను ప్రభుత్వం సేకరించింది.. అయితే అప్పటి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మూలంగా భూసేకరణ చేసిన భూములను ప్రభుత్వం పట్టా మార్పిడి చేయకుండా అలాగే వదిలేయడంతో రోడ్ సైడ్ భూములు మావేనంటూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. అక్కడ భూములు కొన్న కొంతమంది రైతులు ఆధారాలతో ఆదాబ్ హైదరాబాద్ దిన పత్రిక కార్యాలయానికి వచ్చి వారికి జరిగిన అన్యాయాలను తెలియజేశారు.
దౌర్జన్యాలకు పాల్పడుతున్న స్థానిక నాయకులకు శంకర్ పల్లి మండలం కొండకల్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఎల్లయ్య అక్రమార్కులకు సహకరించడం జరుగుతుందని ఆయన సూచనల మేరకే గ్రామంలో చోటామోటా లీడర్ కూడా బెదిరిస్తున్నారని వారు వాపోతున్నారు. దీనిపై కొంతమంది రైతులు కోర్టుకెళ్లారు. కోర్టు తీర్పు ప్రకారం వారికి అనుమతులు ఉన్నా కూడా భూమిపై నుండి వారు జరగకపోవడం శోచనీయం. చట్టం న్యాయం అంటే తమ చుట్టంలా భావిస్తున్నారు. వారు కూడా స్థానిక పోలీసులకు, పంచాయతీ కార్యదర్శి కి, జిల్లా అధికారులకు కోర్టు ఆర్డర్ కాపీలను జతచేస్తూ ఫిర్యాదులు కూడా చేశారు. అయినా కూడా ప్రభుత్వ అధికారులలో చలనం లేదు. ఇలా ప్రజా ప్రతినిధుల మంటూ బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తూ బాధితులను వేధిస్తూ చట్టాన్ని న్యాయాన్ని అపహస్యం చేస్తూ దౌర్జన్యాలు సృష్టిస్తున్న సదరు వ్యక్తులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని అలాగే న్యాయంగా నిజాయితీగా కొనుక్కున్న మా భూములను కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన కొండకల్లు, శంషాబాద్, మేడ్చల్, ఘట్‌కేసర్, తెల్లాపూర్, మహేశ్వరం, పెద్ద అంబర్పేట్, కీసర, ప్రాంతాల్లో ల్యాండ్ గ్య్రాబర్స్ గా మారి అమాయకులను వేధిస్తున్న వారి భరతం పట్టాలంటూ ఉన్నతాధికారులను ఆయా ప్రాంతాల ప్రజలు బాధితులు వేడుకుంటున్నారు.