- మేడ్చల్ జిల్లా, ఘట్‌కేసర్ మండలం, పోచారంలో కబ్జాకోరుల ఇష్టారాజ్యం
- 2,500 గజాల ప్రభుత్వ భూమి కబ్జా
- మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగానే అక్రమ నిర్మాణం
- అక్రమ నిర్మాణాన్ని సక్రమమం చేసే పనిలో కమిషనర్
- తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం
- అధికారుల సపోర్ట్ తోనే 90 శాతం పూర్తైన నిర్మాణ పనులు
- మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన స్థానిక ప్రజలు
- ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని డిమాండ్
తెలంగాణలో ఎక్కడ ఖాళీ కనపడితే చాలు వెంటనే అక్కడ వాలిపోయి అట్టి భూమిని పొతం పెట్టేవరకు నిద్రపోరు. రాష్ట్రంలో భూముల ధరలు బాగా పెరిగిపోవడంతో కబ్జాకోరులు వేటిని వదలడం లేదు. ‘ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారి’ అన్నట్టు కబ్జాదారులకు అదేపనిగా పెట్టుకుంటున్నారు. రాజకీయ నాయకులు, వాళ్ల అనుచరులకు అధికారుల గులాంగిరి చేస్తున్నారు. అదీ అధికార, విపక్ష పార్టీకి చెందిన వారు ఎవరైనా సరే. కాకపోతే ప్రభుత్వంలో వారికైతే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువే ఇస్తున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములు, సర్కారు ఆస్తులు కొల్లగొడుతున్న సరిచప్పుడు లేకుండా ఉంటున్నారు. ‘అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు’ గవర్నమెంట్ కు సంబంధించిన భూములు, ఆస్తులు ఏవైనా కానీ వారికి అప్పగించేస్తున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములు, సర్కారు ఆస్తులు కొల్లగొడుతున్న సరి చప్పుడు లేకుండా ఉంటున్నారు. రాజధాని నగరంలో భూములు చాలా కాస్లీ కావడం.. సిటీ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా భూమి కబ్జా చేస్తున్నారు. అధికార, డబ్బు బలంతో ప్రభుత్వ భూములు కనబడితే వాటిని పొతం పెడుతున్నారు. స్థానికంగా ఉన్న సర్కారు భూములను కబ్జా చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులకు అధికారుల ఫుల్ సపోర్ట్ ఉండడంతో వాళ్లు ఇంకింత రెచ్చిపోతున్నారు.
‘ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకుడు’ అన్నట్టుగా ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతుంటే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు. వారికి ఎలా అనుమతులు ఇచ్చారో అర్థం కానీ పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూములను మింగుతున్న కబ్జాకోరులను కనీసం టచ్ కూడా చేయలేకపోతున్నారంటే ఇక్కడ్నే అర్థం చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం పోచారం గ్రామం సర్వే నెంబర్ 35లో 80 ఎకరాల 36 గుంటల ప్రభుత్వ భూమి కలదు. స్థానిక లీడర్లు సుమారు 2,500 గజాల ప్రభుత్వ భూమిని యధేచ్ఛగా కబ్జా చేసి కమర్షియల్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఈ విషయంపై స్థానిక ప్రజలు తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా వారు కబ్జాదారులతో కుమ్మక్కు అయ్యి ఏ మాత్రం పట్టించుకోకుండా చర్యలు చేపట్టడం లేదు. ఈ నిర్మాణం మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగానే ఉంటుంది. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపడుతున్న, 90 శాతం పనులు పూర్తి కావొస్తున్న మున్సిపల్ కమిషనర్ కి కనిపించకపోవడం గమనార్హం.
‘అందరూ శ్రీ వైష్ణవులే బుట్టెడు రొయ్యలు మాయమయ్యాయి’ అన్న చందంగా తయారైంది అక్రమార్కుల తీరు. హైదరాబాద్ లో భూముల రేట్లు బాగా ఉండడంతో ఆఫీసర్లతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని వాటిని ఆక్రమించేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులను మచ్చిక చేసుకొని ఖరీదైన బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. స్థానిక అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో గ్రామస్థులు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌కు కూడా స్థానికులు కంప్లైంట్ చేశారు. కలెక్టర్ నుండి అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశాలు అందిన కూడా.. చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్ధం పడుతుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దీనిపై దృష్టి సారించి అక్రమ నిర్మాణాలను తొలగించి, ఆ ప్రభుత్వ భూమిని ప్రజల సంక్షేమం కొరకు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా ఇందుకు సహకరించిన అధికారులను చర్యలు తీసుకొని, కబ్జాచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.