Monday, March 31, 2025
spot_img

గండిపేట్ స‌ర్కారీ భూముల‌కు గండి

Must Read
  • రంగారెడ్డి జిల్లా, గండిపేట మండ‌లం, కోకాపేట గ్రామ‌ ప‌రిధిలో యధేచ్చగా భూ కబ్జా
  • కోకాపేటలో సర్కారు కోట్ల విలువైన భూమి అంతా ఖతం
  • స‌ర్వే నెంబ‌ర్ 147లో కొంత ప్రభుత్వ భూమి మాయం
  • స‌ర్వే నెంబ‌ర్ 100, 109లో కూడా క‌బ్జాకు పాల్పడ్డ అక్ర‌మార్కులు
  • కొంత భూమి క‌బ్జా చేసిన ప్రైవేట్ వ్య‌క్తులు
  • స‌ర్కార్ భూమిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం
  • అనుమ‌తులు ఇచ్చిన నార్సింగి మున్సిప‌ల్ కమిష‌న‌ర్
  • ప్రేక్షకపాత్రలో రెవెన్యూ, మున్సిప‌ల్ శాఖ అధికారులు
  • మాముళ్ల మత్తులో జోగుతూ కబ్జాకోరులకు సపోర్ట్ చేస్తున్న ఆఫీస‌ర్స్‌

స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలో కోట్లు కూడబెట్టేది ఎవరంటే దాంట్లో మొదట పొలిటీషియన్లు, రెండోది కబ్జాకోరులే. ఆ తర్వాత వీళ్ల ఇద్దరికీ నచ్చిన, మెచ్చిన వారు ప్రభుత్వ అధికారులే. మిగతా నిరుపేద, మధ్యతరగతి వారు ఎక్కడున్నారో అక్కడే ఉండబట్టే. కారణమేమంటే వాళ్లూ పొట్టపోసుకునుడు వరకే తెలుసు. భాగ్యనగరం పరిధిలో ఉన్న ప్రభుత్వ, అసైన్డ్, దేవాలయ భూములు సాంతం తినేస్తున్నారు. భూమి ఖాళీ కనపడితే గద్దల్లా వచ్చి వాలిపోతున్నారు. రాజకీయ, అధికార బలంతో గవర్నమెంట్ భూములను కొల్లగొడుతున్నారు. కోట్లాది రూపాయల విలువైన సర్కారు భూములను చెరబడుతున్నారు. రాజకీయ, డబ్బు బలంతో అలవొకగా భూములను మింగేస్తున్నారు. ప్రభుత్వంలో పనిచేసే ఆయా శాఖల అధికారుల అండదండలతోనే ల్యాండ్ కబ్జాలు చేసేస్తున్నారు. అధికారులు భారీగా ముడుపులు తీసుకొని అక్రమార్కులకు సపోర్ట్ చేస్తున్నారు. ‘వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చొన్న తునకలు పడతాయని’ అన్నట్టుగా ఆఫీసర్ల తీరు ఉంటుంది. డబ్బులు ముట్టచెప్పితే చాలు ఏం మాయ చేయడంలో వారు సిద్ధ హస్తులు. రికార్డులను సైతం మార్చేసి అక్రమ మార్గంలో భూములను ముట్టచెప్పుతున్నారంటే అతిశయోక్తికాదు. ప్రభుత్వ భూములను కబ్జా చేసి పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతుంటే రెవెన్యూ, హెచ్ఎండీఏ, మున్సిప‌ల్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు.. వారికి ఎలా అనుమతులు ఇచ్చారో అంతుచిక్కడం లేదు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను మింగుతున్న కబ్జాకోరులను టచ్ కూడా చేయలేకపోతున్నారంటే అధికారులు ఏ స్థాయిలో లంచాలకు మరిగారో అర్థం చేసుకోవచ్చు.

ప్రభుత్వ అధికారుల అండ ఉంటే చాలు తిమ్మిని బమ్మి చేసేస్తారు. అందులో భాగంగానే కోకాపేటలో కోట్ల విలువైన భూములు కొల్లగొడుతున్నారు. ఇక వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండ‌లం కోకాపేట గ్రామ ప‌రిధిలోని స‌ర్వే నెంబ‌ర్ 147లో 31 ఎక‌రాల 28 గుంట‌ల ప్ర‌భుత్వ భూమి ఉండేది. స‌ర్వే నెంబ‌ర్‌ 147/1లో 28గుంట‌లు, 147/2లో 31ఎక‌రాల గవర్నమెంట్ భూమి కలదు. స‌ర్వే నెంబ‌ర్ 100లో మొత్తం 30 ఎక‌రాల 25 గుంట‌ల ప్ర‌భుత్వ భూమి ఉంది. అందులో స‌ర్వే నెంబ‌ర్ 100/1లో 18 ఎక‌రాల 1గుంట‌, స‌ర్వే నెంబ‌ర్ 100/2లో 12 ఎక‌రాల 24 గుంట‌లు ఉండేది. స‌ర్వే నెంబ‌ర్ 109లో మొత్తం 63 ఎక‌రాల 37 గుంట‌ల సర్కారు భూమి క‌ల‌దు. అందులో స‌ర్వే నెంబ‌ర్ 109/1లో 10 ఎక‌రాల 20 గుంట‌లు, 109/2లో 35 ఎక‌రాల 17 గుంట‌లు. స‌ర్వే నెంబ‌ర్ 147, 100, 109 అప్ప‌టి ప్ర‌భుత్వం హెచ్ఎండీఏ లేఅవుట్ చేసి భూముల‌ను వేలం వేసింది. అందులో మిగిలిన భూముల‌ను కొంద‌రు అక్ర‌మార్కులు చెర‌ప‌ట్టారు.. ఈ విష‌యం మండ‌ల త‌హ‌సీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి హెచ్ఎండీఏ వారికి స‌ర్వే నెంబ‌ర్ 147, 100, 109 ఎంత భూమిని కేటాయించారు.. అందులో వేలం వేసిన అనంత‌రం మిగులు భూమి ఎంత ఉందని స్ప‌ష్ట‌త కోర‌గా, త‌హ‌సీల్దార్ త‌న వ‌ద్ద వాటికి సంబంధించిన రికార్డులు లేవ‌ని, హెచ్ఎండీఏ తెలుసుకోవాల‌ని పొంత‌న లేని స‌మాధానం చెప్ప‌డం శోచ‌నీయం. స‌ర్కార్ భూమిని కాపాడ‌వ‌ల్సిన బాధ్య‌త గ‌ల త‌హ‌సీల్దార్ బాధ్య‌త‌ర‌హితంగా స‌మాధానం ఇవ్వ‌డంపై ప‌లు అనుమానాల‌కు తావీస్తుంది..

కాగా, స‌ర్వే నెంబ‌ర్ 147, 100, 109లో సైతం అక్ర‌మంగా బ‌హుళ అంత‌స్తుల‌ నిర్మాణాలు, షెడ్లు, షాపింగ్ మాల్స్‌, హోట‌ల్స్‌, రెస్టారెంట్స్ లు భారీగా వెలిశాయి. ‘అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?’ అన్న చందంగా రెవెన్యూ అధికారులకు తెలియకుండా కబ్జాలు జరుగుతాయా అనే డౌట్ వస్తుంది. స‌ర్వే నెంబ‌ర్ 147లో స‌ర్కారీ జాగలో య‌ధేచ్ఛ‌గా ప్రీమియ‌ర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్ర‌భుత్వ స్థ‌లంలో నిర్మాణానికి మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖ అధికారులు అనుమ‌తులు ఇచ్చారు. ఇందుకోసం భారీ ఎత్తున ముడుపులు తీసుకొని నిర్మాణానికి అనుమ‌తులు ఇచ్చిన‌ట్లు ప‌లు అనుమానాలు తలెత్తుతున్నాయి. స‌ర్వే నెంబ‌ర్ 100 ప్ర‌భుత్వ భూమిని కొంద‌రు నాయ‌కులు, అధికారుల స‌హాయ స‌హ‌కారాల‌తో క‌బ్జా చేసి య‌ధేచ్ఛ‌గా బహుళ అంత‌స్తులు, హోట‌ల్స్‌, షెడ్లు, షాపులు, రెస్టారెంట్‌లు, షాపింగ్ మాల్స్ నిర్మించారు. ఇంకా నిర్మిస్తున్నారు కూడా. ‘ఎద్దుగా ఏడాది బతకడం కంటే ఆంబోతుగా ఆర్నెల్లు బతకడం మేలు’ అని పెద్దలు చెబుతుంటారు. కానీ, అక్రమార్కులకు వాళ్లకు అండగా నిలిచే అధికారులకు సిగ్గులేకుండా పోతుంది.

స‌ర్వే నెంబ‌ర్ 100, 109, 147ల‌లోని మిగులు భూమిని ప్ర‌భుత్వం వేలం వేస్తే కోట్ల రూపాయ‌ల ఆదాయం ప్ర‌భుత్వానికి చేకూరుతుంది. కానీ, త‌హ‌సీల్దార్‌, కిందిస్థాయి ఉద్యోగ‌స్థులు వారి స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం క‌బ్జాదారుల‌తో చేతులు క‌లిపి కోట్ల రూపాయ‌ల ప్ర‌భుత్వ భూమిని ముట్టజెప్పారు. గ‌తంలో ఇరిగేష‌న్ శాఖ‌కు సంబంధించిన ఓ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ భూక‌బ్జాల‌ విష‌యంలో అక్ర‌మార్కులకు స‌హ‌క‌రించి కోట్ల గ‌డించిన విష‌యంలో ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డారు. ఏసీబీ ద‌ర్యాప్తులో అత‌ని ఆస్తుల విలువ వంద‌ల కోట్లు ఉన్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చిన విష‌యం అంద‌రికి విధిత‌మే..

ఈ విష‌యంపై రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌, త‌హ‌సీల్దార్‌, డిప్యూటీ త‌హ‌సీల్దార్‌ల‌ను ఆదాబ్ ప్ర‌తినిధి సంప్ర‌దించ‌గా అందుబాటులోకి రాలేదు. సర్కారు పెద్దలు, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని క‌బ్జాకు గురైన ప్రభుత్వ భూమి స్వాధీన‌ప‌ర్చుకొని, అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ స‌మ‌గ్రంగా విచారించి, వాస్త‌వాల ఆధారంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అదేవిధంగా ముడుపులు తీసుకొని ప్రైవేట్ వ్య‌క్తుల‌కు అండగా నిలిచిన అధికారుల‌పై చ‌ట్ట ప‌ర‌మైన తీసుకోవాల‌ని, వారి అక్ర‌మ ఆస్తుల‌పై ఏసీబీ స‌మ‌గ్రంగా ద‌ర్యాప్తు చేయాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS