వింతపోకడ ప్రదర్శిస్తున్న బొల్లారం మున్సిపల్ కమిషనర్ మంగతాయారు..
- ప్రభుత్వ వేతనం తీసుకుంటూ ప్రైవేటు వ్యక్తులకు సేవలు
- స.నె. 75లో అక్రమ విల్లాల నిర్మాణాలకు అండగా అధికారిణి
- కాసులకు కక్కుర్తి పడి మున్సిపల్ చట్టానికి తూట్లు
- సస్పెండ్ చేసి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్స్..
- దొడ్డిదారిన పొందిన పీటీఐన్ నెంబర్లను రద్దు చేసిన కమిషనర్..
- అక్రమాల విల్లాలపై చర్యలకు వెనుకడుగు వేస్తున్న మేడం గారు..
- సిడిఎంఏ కమిషనర్ కు సైతం వాటాలున్నాయన్న అనుమానాలు ..?
- మున్సిపల్ శాఖ మంత్రి, అధికారుల వ్యవహార తీరుపై ఓ లుక్కేయండి..
ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేసే అధికారులు ఆ ప్రజలకోసం పనిచేయాల్సి ఉంటుంది.. ప్రభుత్వ ఉద్యోగులు అంటే పబ్లిక్ సర్వెంట్స్ అని అర్ధం.. ప్రజలకు సేవ చేయడం మానేసి ప్రజలకు సంబంధించిన ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తులను అడ్డగోలుగా ప్రయివేట్ వ్యక్తులకు కట్టబెడుతూ.. ప్రభుత్వ ఉద్యోగి అనే పదానికి మచ్చతెస్తున్నారు కొందరు అవినీతి అధికారులు. వీరికి చట్టాలన్నా, నిబంధనలు అన్నా లెక్కే లేదు.. కేవలం అక్రమార్కులు విదిల్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి, అక్రమార్జనే ద్యేయంగా సాగిపోతున్నారు.. ఇలాంటి ఉద్యోగుల వలన కాస్తో..కూస్తో నిజాయితీగా వుండే అధికారులు సైతం మాటలు పడాల్సి వస్తుంది. అందరినీ ఒకే గేటుకి కట్టాల్సిన దౌర్భాగ్యం నెలకొంది.. ఇలాంటి కోవకే చెందుతారు బొల్లారం మున్సిపల్ కమిషనర్ మంగతాయారు.. అక్రమ నిర్మాణాలకు తనవంతుగా సహకారం అందిస్తూ అవినీతికి కొమ్ముకాస్తూ.. అందినకాడికి దోచుకుంటున్నారు.. వివరాల్లోకి వెళ్తే,
సంగారెడ్డి జిల్లాలోని, బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 75లో ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ విల్లాల నిర్మాణం చేపట్టారు కొందరు అక్రమార్కులు.. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి, నిర్మాణ అనుమతులు లేకుండా విల్లాల నిర్మాణం చేపట్టిన విషయంపై మున్సిపల్ చట్టం 2019 సెక్షన్ 23 ప్రకారం కూల్చి వేస్తామని నోటీస్ నెం. ఎంసిబి/టిపీస్/ యూసీ / 99 / 2023 తేది : 28-08-2023 అక్రమ నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చారు బొల్లారం మున్సిపల్ అధికారులు.. లెటర్ నెంబర్. ఎంసిబి / టీపీస్ / యూసీ / 62 తేది : 17-01-2024 రోజున మున్సిపల్ అధికారులు జెసిబి వాహనాలతో అక్రమ విల్లాలను కూల్చివేసి, విద్యుత్ నీటి కనెక్షన్లు ఇవ్వడానికి వీలులేదని సంబంధిత అధికారులకు లేఖలు సైతం రాశారు.. అయినా అక్రమ నిర్మాణదారులు దొడ్డిదారిన బోగస్ పిటిఐఎన్ నెంబర్లు పొంది యదేచ్ఛగా నిర్మాణాలు చేపట్టినా ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం అధికారుల అవినీతికి అద్దం పడుతుంది..
బొల్లారం మున్సిపల్ కమిషనర్ అక్రమంగా పొందిన పి టి ఐ ఎన్ నెంబర్లను రద్దు పరచాలని లెటర్ నెంబర్ ఏ / 103 / 2024 తేది : 19-07-2024 సిడిఎంఏ కమిషనర్ కు లేఖ రాసి చేతులు దులుపుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. బొల్లారం మున్సిపల్ కమిషనర్ గా విధులు వెలగబెడుతున్న మంగతాయారు పోకడ పై విమర్శలు వెలువెత్తుతున్నాయి.. ప్రభుత్వ వేతనం తీసుకుంటూ మున్సిపల్ చట్ట నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రైవేటు వ్యక్తులకు తొత్తుగా మారి, ప్రభుత్వానికే మచ్చ తెస్తోంది అంటూ కమిషనర్ మంగతాయారుపై మండిపడుతున్నారు స్థానిక ప్రజలు.. అక్రమ నిర్మాణాలను చేస్తున్న వారితో లోపాయికారి ఒప్పందం చేసుకొని అక్రమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అందిన కాడికి దోచుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను కూల్చివేసినా, నోటీసులు ఇచ్చినా మరల నిర్మాణాలు చేపట్టి పూర్తిస్థాయి నిర్మాణ దశకు ఈ నిర్మాణాలు వచ్చాయంటే సదరు అధికారి ఆ వైపు కన్నెత్తి చూడలేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అవినీతికి పాల్పడ్డ అధికారి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి వెనుకడుగు వేస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి.. సిడిఎంఏ కమిషనర్ కు అక్రమ నిర్మాణాలపై లేఖ రాసి చేతులు దులుపుకుంటున్నా నిర్మాణాలు యదేచ్ఛగా చేపట్టడంపై, బొల్లారం మున్సిపల్ కమిషనర్ పై ఏలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్టేడియం ఏ కమిషనర్‌కు సైతం వాటాలు ముడుతున్నాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పలువురు సామాజికవేత్తలు.. బోల్లారం మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ విల్లాల నిర్మాణాలపై దృష్టి సారించి, అధికారుల తీరుపై విచారణ జరిపి, మున్సిపల్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కమిషనర్ మంగతాయారును విధుల నుండి తొలగించాలని, అదేవిధంగా అక్రమ నిర్మాణాలను సైతం కూల్చివేసి, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టకుండా పారదర్శకమైన పాలన అందించాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. సర్వే నెంబర్ 75 లో జరుగుతున్న విల్లాల పై తీసుకున్న చర్యలకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ వివరణ కోరగా స్పందించలేదు.. బొల్లారం మున్సిపాలిటీలో దొంగ హౌస్ నెంబర్లతో చేపట్టి న అక్రమ నిర్మాణాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ‘ఆదాబ్ హైదరాబాద్ ‘ ‘ మా అక్షరం అవినీతి పై అస్త్రం’.