- గ్రూప్1 అవకతవకలపై విచారణ జరిపించాలి : మోతిలాల్ నాయక్
అంబేడ్కర్ జయంతి రోజే ఉస్మానియా యూనివర్సిటీలో గ్రూప్1 అభ్యర్థులు నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ మోతిలాల్ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకొని మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని అంబేడ్కర్ చిత్రపటానికి మొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ జీవో నెంబర్ 55 తో ఉన్న నోటిఫికేషన్ జీవో నెంబర్ 29 తో ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. మళ్లీ తర్వాత నోటిఫికేషన్లు జీవో నెంబర్ 55 తో ఎందుకు ఇస్తున్నారని టిజిపిఎస్పి వివరణ ఇవ్వాలని కోరారు. 21093 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాస్తే 21,103 మంది ఎలా వచ్చారని మండిపడ్డారు. 18, 19 సెంటర్లలో 74 మంది ఎలా సెలెక్ట్ అయ్యారని అన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులు 7800 మంది పరీక్ష రాస్తే పట్టుమని పదిమంది కూడా సెలెక్ట్ కాలేదని అదే ఉర్దూ మీడియం అభ్యర్థులు తొమ్మిది మంది పరీక్ష రాస్తే ఏడుగురికి 450 పైచిలుకు మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. క్వాలిఫై అయిన అభ్యర్థుల పూర్తి డేటాను, ప్రిలిమ్స్, మెయిన్స్ రాసిన అభ్యర్థుల డేటాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 654 మందికి ఒకే రకమైన మార్కులు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు. అన్ని ఆధారాలు ప్రభుత్వం ముందు ఉంచుతున్నామని ప్రభుత్వం తప్పకుండా విద్యార్థులకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అభ్యర్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసిన తర్వాతనే ఈ నోటిఫికేషన్ మీద ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరారు. లేనియెడల రాహుల్ గాంధీ మీద నల్ల టీ షర్టు ఉద్యమాన్ని ప్రారంభిస్తామని రాహుల్ గాంధీని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు.