- మాజీమంత్రి హరీష్ రావు విమర్శలు
వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల భూగర్భజలాలు తగ్గడం, నీటి ఎద్దడి పెరగడంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు సాగు నీళ్ల కోసం రైతుల గోస పడితే.. ఇప్పుడు తాగు నీళ్ల కోసం ప్రజల ఘోష పడాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో పొలాలు తడారిపోతున్నాయని.. ప్రజల బతుకులు ఎడారి అయిపోతున్నాయని ఆవేదన చెందారు. కాంగ్రెస్ నాయకులు ముందుచూపు లేమి, నిర్లక్ష్యంతో ప్రాజెక్టులో నీళ్లు ఒడిసిపట్టలేదని.. చెరువులు నింపలేదని, భూగర్భ జలాలు పెంచలేదని హరీశ్‌రావు తెలిపారు. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు సరఫరా చేయడం లేదని అన్నారు. కేసీఆర్ ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేసి తాగు నీళ్లిస్తే, రేవంత్ రెడ్డి కనీసం ఆ పథకాన్ని కొనసాగించలేక పోతున్నాడని విమర్శించారు. ఉమ్మడి పాలన నాటి బిందెలు, డ్రమ్ములు మళ్లీ రోడ్లపై కనిపిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ఆత్మగల్ల పాలకుడికి, తెలంగాణ ప్రయోజనాలు పట్టని పాపాత్ముడికి ఉన్న తేడా ఇది అని వివరించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కృత్రిమ కరువు అని హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనావైఫల్యం తెచ్చిన ప్రజల కన్నీటి కరువు అని అన్నారు. ఇకనైనా, ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాల ప్రవాహాన్ని పారించడం మానేసి, ప్రజల ఇళ్లకు తాగు నీటిని పారించాలని ఎక్స్ వేదికగా సూచించారు.