కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి టి. హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ ఇద్దరు నాయకులు మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్లకు విచారణార్హత లేదని రాష్ట్ర ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ వాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నదని కోర్టుకు తెలియజేశారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపడుతుందని కూడా ఏజీ వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 7కి వాయిదా వేసింది. కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్ల నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో మరో కీలక మలుపుగా భావించబడుతున్నాయి.