- మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్
చట్టానికి లోబడే హైడ్రా పనిచేస్తుందని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ తెలిపారు. హైడ్రా కూల్చివేతలు, నిర్వాసితుల తరలింపు, బాధితుల ఆందోళన, తదితర అంశాల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఉపాధితో పాటు డబుల్ బెడ్ ఇండ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మూసీ నిర్వాసితులను బలవంతంగా తరలించడం లేదని వెల్లడించారు. చిన్న వర్షాలకే హైదరాబాద్ నగరం ముంపునకు గురవుతుందని, మూసీకి వరదలు వస్తే ప్రజలే ఇబ్బందులు పడతారని అన్నారు. మూసీ ఆధునికీకరణకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాద్యత హైడ్రాకు ఉంది : హైడ్రా కమిషనర్ రంగనాథ్
చెరువులు,నాలాలను కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉందని తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ, హైడ్రా కూల్చివేతలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమీన్పూర్ లో ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అయ్యాయని పేర్కొన్నారు. అధికారులు ముందస్తు సమాచారం ఇచ్చిన కొంతమంది ఖాళీ చేయట్లేదాని, సరైన సమయం ఇచ్చిన తర్వాతే ఆక్రమణలు కూల్చివేస్తున్నామని స్పష్టం చేశారు. పేదలకు ఇబ్బంది పెట్టాలనేది హైడ్రా ఆలోచన కాదని, హైడ్రాని బూచిగా చూపించి ప్రజలను భయపెడితే భవిష్యత్తు తరాలకు నష్టం జరుగుతుందని వెల్లడించారు.