- పత్తులగూడ చెరువు కబ్జాకు గురైందని తెలిసన కూడా చర్యలు చేపట్టని ఇరిగేషన్ శాఖ
- మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్ మండలం పత్తుల గూడలో అక్రమార్కుల ఇష్టారాజ్యం
- సుమారు 10 ఎకరాల 15 గుంటల విస్తీర్ణంలో పత్తులగూడ చెరువు
- చెరువును కబ్జా చేసి యధేచ్ఛగా విల్లాల నిర్మాణం
- మొదటగా ఓ టైల్స్ కంపెనీ.. ఆ తర్వాత 6విల్లాల నిర్మాణం
- బఫర్, ఎఫ్‌టిఎల్‌లోకి వస్తున్నట్లు నివేదిక ఇచ్చిన నార్త్ ట్యాంక్స్ డివిజన్
- ఇరిగేషన్, సంబంధిత అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారనే విమర్శలు
- చెరువు కబ్జా చేసి నిర్మాణం చేపట్టారని నివేదిక ఉన్నప్పటికి చర్యలు శూన్యం
- భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు
- చెరువు కబ్జా అవుతున్న ప్రేక్షక పాత్రలో ఇరిగేషన్ శాఖ
- అక్రమ నిర్మాణాలను తొలగించి, చెరువును పునరుద్దరించాలని స్థానికుల డిమాండ్
తెలంగాణలో భూముల ధరలు పెరిగిపోవడంతో కొందరూ వాటిని పొతం పెట్టి కోట్లు గడిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో ల్యాండ్స్ ధరలు రూ.కోట్లల్లో పలుకుతున్నాయి. రాష్ట్ర రాజధాని నగరం పరిధిలో ఏ మారుమూల ప్రాంతంలో చూసిన భూములు చాలా కాస్లీ అయిపోయాయి. హైదరాబాద్ చుట్టు ముట్టు ఉన్న ల్యాండ్స్ పై కబ్జాకోరుల చూపు భూములపై పడింది. సెంట్ భూమి ఖాళీగా కనిపించిన సొంతం చేసుకోవడానికి అక్రమార్కులు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వంలో పనిచేసే ఆయా శాఖల అధికారుల అండదండలతోనే ల్యాండ్ కబ్జాలు చేసేస్తున్నారు. అధికారుల వీక్ నెస్ ను వాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారుల సపోర్టుతో కబ్జాకోరులు చెరువులు, సర్కారు భూములను చెరపడుతున్నారు. జీహెచ్ఎంసీ, ప్రభుత్వ అనుమతులు లేకుండానే బిల్డింగ్ లను నిర్మిస్తున్నారు. భారీగా లంచాలు అందజేసి ఈజీగా పని పూర్తిచేసుకుంటున్నారు. కొద్దో గొప్పో ఇచ్చే ముడుపులను ఆఫీసర్లు తీసుకొని అక్రమార్కులకు సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వాలు మారిన, పాలకులు ఎవరొచ్చినా తాము మాత్రం పర్మినెంట్ అంటూ కొందరూ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.

వివరాలలోకి వెళ్తే… మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్ మండలం పత్తులగూడ గ్రామంలో సర్వే నెంబర్ 36లో సుమారు 10ఎకరాల 15 గుంటల విస్తీర్ణం గల పత్తులగూడ చెరువు కబ్జాకు గురైంది. అక్రమార్కులు చెరువును కబ్జాచేసి అందులో యధేచ్ఛగా విల్లాల నిర్మాణం చేపట్టారు. భారీ ఎత్తున ముడుపులు తీసుకొని అధికారులు కబ్జాకోరులకు అండగా నిలిచినట్లు ఆరోపణలున్నాయి. చెరువు కబ్జా అవుతున్నా ఇరిగేషన్ శాఖ ప్రేక్షక పాత్ర వహిస్తుంది. అయితే దీనిపై స్థానికులు ప్రభుత్వానికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇరిగేషన్ అధికారులు సంయుక్త నివేదికలో చెరువును కబ్జా చేసి నిర్మాణం చేపట్టారని మే 2022న ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. కబ్జాచేశారనే ఆధారాలు ఉన్నప్పటికి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యామేంటో అర్థం కావడం లేదు. గతంలో కబ్జాదారులు మొదటగా ఓ టైల్స్ కంపెనీని ఏర్పాటు చేశారు. అనంతరం అదే స్థానంలో 6 విల్లాలు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇంత జరుగుతున్నా నాకేం పట్టింది అన్నట్టుగా ఉండడంతో వాళ్లూ ఇంకింత రెచ్చిపోతున్నారు. వాస్తవానికి ఈ నిర్మాణాలకు గతంలో విధులు నిర్వర్తించిన జీహెచ్ఎంసీ, సంబంధిత అధికారులే బాజప్తా అనుమతులు ఇచ్చారు. చెరువును కబ్జాచేసి విల్లాలు కడుతుంటే వీళ్లేలా పర్మిషన్ ఇచ్చారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో ఇరిగేషన్, మండల సర్వేయర్, అప్పటి తహసీల్దార్ కు భారీగానే మామూళ్లు ముట్టాయని ఆరోపణలు వస్తున్నాయి. ‘ఆలికి అన్నంపెట్టి, ఊరికి ఉపకారంచేసినట్లు చెప్పాడు’ అన్నట్టు ఉన్నది ప్రభుత్వ అధికారుల పనితీరు. తప్పు జరిగింది అని రిపోర్ట్ ఇస్తే ఏం లాభం. చెరువును కబ్జాచేసి పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టి అమ్ముకుంటుంటే నోట్లో వేలేసుకొని గమ్మున కూర్చున్న వీళ్ల సంగతెంటో ఎవరికీ తెలియదా.

‘ఏదుం తిన్నా ఏకాసే, పందుం తిన్నా పరగడుపే’ అన్నట్టూ అక్రమార్కులు డబ్బులకు ఆశపడి కబ్జాదారులు చెరువులను సైతం వదలడం లేదు. రాజకీయ నాయకుల అండదండలు, అధికారుల అలసత్వంతో వారు పెట్రేగిపోతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి చెరువులను సైట్లు, విల్లాలుగా మార్చివేసి అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కళ్ల ముందే అంతస్తుల మీద అంతస్తులు నిర్మిస్తూ చెరువు ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉంది. పైగా అక్రమార్కులు ఇచ్చే ముష్ఠి డబ్బులకు ఆశపడి అధికారులు తమ డ్యూటీని మరుస్తున్నారు. తద్వారా చెరువుల అన్యాక్రాంతానికి ప్రత్యక్ష కారణమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. చెరువులు, కుంటలు లేకుండా చేస్తూ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే వాటిని పూర్తిగా కనుమరుగు చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దీనిపై దృష్టి సారించి చెరువును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకొని అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించి, చెరువును పునరుద్దరించాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇందుకు సహకరించిన అధికారులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.