తెలంగాణలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు రెడ్‌అలర్ట్ ప్రకటించింది. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన తొమ్మిది జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉందని.. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్ మహబూబ్‌నగర్ జిల్లాలకు వడ గాల్పుల హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.