Thursday, April 24, 2025
spot_img

ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా వెతికి శిక్షిస్తాం

Must Read
  • వారికి మద్దతు ఇస్తున్న వారిని సైతం వదలబోం
  • కలలో కూడా ఊహించని విధంగా శిక్ష వేస్తాం
  • వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే
  • బీహర్‌ పర్యటనలో ప్రధాని మోడీ ఘాటు హెచ్చరిక

ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు. ఇది భారతీయ ఆత్మపై జరిగిన దాడి అని ప్రధాని అభివర్ణించారు. ఇందుకు వారు భారీ మూల్యం చెల్లిచుకోక తప్పదన్నారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా బిహార్‌లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గాంలో ఉగ్రదాడి గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ముష్కరులకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తొలుత తన ప్రసంగం ఆరంభంలో పహల్గాం మృతులకు ప్రధాని నివాళులర్పించారు. మోదీతో పాటు సభలోని వారంతా ఒక నిమిషం పాటు మౌనం పాటించి అంజలి ఘటించారు. అనంతరం దాడి గురించి ప్రధాని స్పందించారు. వారు భారత్‌ ఆత్మపై దాడి చేసే దుస్సాహసం చేశారు. ప్రపంచానికి మేము చెప్పేది ఒక్కటే.. ఉగ్రవాదులను, వారికి సాయమందించిన వారందరికీ గుర్తించి శిక్షిస్తాము. భూమి అంచుల వరకూ వారిని వెంటాడి పట్టుకుంటాము. ఉగ్రవాదంతో భారత్‌ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేరని మోదీ నిప్పులు చెరిగారు.

పహెల్గామ్‌లోని బైసారంలో పర్యటనకు వచ్చిన టూరిస్టులను మంగళవారం నాడు ఉగ్రవాదులు కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది మృతి చెందారు. ఈ దాడి కుట్రదారు పాక్‌పై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ కమిటీ పాక్‌పై పలు చర్యలకు ఉపక్రమించింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడంతో పాటు దౌత్య పరమైన చర్యలకు ఉపక్రమించింది. పాక్‌లో భారత సాయుధదళాల సలహాదారులను వెనక్కు పిలిపించుకోవడంతో పాటు ఇక్కడున్న పాక్‌ రక్షణ శాఖ సలహాదారులను కూడా దేశం వీడాలని ఆదేశించింది.

ఈ క్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్‌ దేశం అండగా ఉంది. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడిని కోల్పోయింది. ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యాడు. కార్గిల్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రతిఒక్కరిలోనూ బాధ, ఆగ్రహం ఉన్నాయి. ఇది కేవలం పర్యాటకులకు జరిగిన దాడి మాత్రమే కాదు.. భారత ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన సాహసం అని మోదీ అన్నారు. పహల్గాం ఉగ్రదాడి వెనక ఉన్నవారు.. కుట్రలో భాగమైన వారికి ఊహకందని రీతిలో శిక్ష విధిస్తాం. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, ట్రాక్‌ చేసి, శిక్షిస్తామని యావత్‌ భారతీయులకు హామీ ఇస్తున్నా. బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉంది. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసేందుకు సమయం ఆసన్నమైంది. ఉగ్రమూకల వెన్నెముకను 140 కోట్ల మంది విరిచేస్తారని ప్రధాని గట్టిగా హెచ్చరించారు.

ఈ సందర్భంగా భారత్‌కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. మానవత్వాన్ని విశ్వసించే ప్రతిఒక్కరూ మాకు అండగా నిలిచారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఉగ్రవాదంతో భారత ఐకమత్య స్ఫూర్తిని బద్దలు కొట్టలేరు. ఉగ్రవాదానికి శిక్ష తప్పదని మోదీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కూడా ఉగ్రవాదుల ఘాతుకాన్ని ఖండించారు. ఉగ్రవాదంపై పోరులో యావత్‌ దేశం ఏకమైందని అన్నారు. ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్‌లో ముష్కరులు నరమేధానికి పాల్పడిన సంగతి తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చినవారు పర్యాటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 25 మంది పర్యాటకులు, ఓ కశ్మీరీ యువకుడు ప్రాణాలు కోల్పోయారు.

Latest News

గ్రామాలు స్వయం ప్రతిపత్తి సాధించాలి

గాంధీ మహాత్ముడి ఆశయం కూడా అదే పంచాయితీ నిధులు వాటికే ఖర్చు చేస్తున్నాం జాతీయ పంచాయితీరాజ్‌ దినోత్సవంలో డిప్యూటి సిఎం పవన్‌ గ్రామాలు స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలుగా ఏర్పడాలని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS