- రాబోయే కాలంలో 20లక్షల ఇండ్లు కట్టి తీరుతాం
- పేదవాడికి అండగా ప్రభుత్వం పనిచేస్తుంది
- విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట
- ఇంటిగ్రేటెడ్ పాఠశాలల స్థాపనకు రూ.11వేల 600 కోట్లు మంజూరు
- అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా, రాబోయే కాలంలో 20 లక్షల ఇండ్లు కట్టి తీరుతామని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచారశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంత్రి ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపి పోరిక బలరాం నాయక్, కలెక్టర్ జితేష్‌విపాటెల్, ఎస్పీ రోహిత్‌రాజ్‌లతో కలిసి ఆదివారం ఇల్లందులో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఇల్లందు మండలం పూబెల్లి గ్రామంలో మంజూరైనటువంటి 83 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన నిలబడి వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న కలను సాకారం చేస్తూ ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున మొదట విడతగా 58 నియోజకవర్గాలకు గాను 416500 ఇండ్లను అందించడం జరుగుతుందన్నారు. దాంట్లో భాగంగా ఇల్లందు నియోజకవర్గ పూబెల్లి గ్రామం నందు శంకుస్థాపన చేసి సుమారు 83ఇళ్లను ఫైలెట్ ప్రాజెక్టు కింద అందించడం జరిగిందని ఇది చాలా
శుభపరిణామమన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా వెనకడుగు వేయకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోని రాబోయే కాలంలో 20లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టే విధంగా చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పేదవాడికి అండగా ఉండటమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం ఇల్లందు పట్టణంలో సుమారు 37కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక పరిజ్ఞానంతో ఇల్లందు నియోజకవర్గప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వీలుగా నిర్మించనున్న వంద పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో విద్య, వైద్యంకి పెద్దపీట ఉంటుందన్నారు. గతప్రభుత్వాలు పేదవాడి కష్టాలను విస్మరించాయని, ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్య, వైద్యో, ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, గిరిజన బిసి రైతుల అభివృద్ధి పేదవాడికి చేసే సహాయంలో వెనకడుగు వేయకుండా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
మొదటి విడతగా 58ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు గాను 11600కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇల్లందు మండలంలో ఆర్‌అండ్‌బి రోడ్డు నుండి బోయితండా వరకు కోటి 50లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన బీటిరోడ్ పనులకు, రొంపేడు చెక్‌పోస్ట్ నుండి మిట్టపల్లి వరకు రూ.3కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటిరోడ్డు పనులకు, ఇల్లందు మండలంలో ఆర్‌అండ్‌బి రోడ్డు నుండి మామిడి గుండాల వరకు 4కోట్ల46లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రత్యేక మరమ్మత్తుపనులు, బీటి రోడ్డు రెన్యువల్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అన్ని పనులు నాణ్యతను పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యాచందన, ఆర్డీఓ మధు,జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.