- మార్చి 22న ప్రారంభం కానున్న టోర్నీ
- వేసవిలో మజా ఇవ్వనున్నప్రీమియర్ లీగ్
క్రికెట్‌లో మరో మజా గేమ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకోవడంతో క్రికెట్ అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో ఐపిఎల్‌కు తెరలేవనుంది. అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపిఎల్ సీజన్ 2025కి మార్చి 22న ప్రారంభం కానుంది. మే 25న కోల్‌కతాలో జరిగే ఫైనల్ తో మెగా టోర్నీకి తెరపడుతుంది. ఈసారి కూడా పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మార్చి 23న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌తో టోర్నమెంట్ ప్రారంభమవుతోంది. ఈ సారి అన్ని జట్లు ట్రోఫీపై కన్నేశాయి. కిందటిసారి రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలనే పట్టుదలతో ఉంది. కోల్‌కతా కూడా టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. ప్రస్తుత ఛాంపియన్ కోల్‌కతా కూడా టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. రహానె సారథిగా రావడంతో జట్టు ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఇలా బరిలో ఉన్న పది జట్లలో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో మెగా టోర్నమెంట్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.
ఇక ఆరంభం నుంచి టోర్నమెంట్‌లో ఆడుతున్నా ఒక్కసారి కూడా ట్రోఫీని సాధించడంలో విఫలమవుతూ వస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ ఈసారి ఆ లోటును తీర్చుకోవాలని భావిస్తున్నాయి. మూడు జట్లు కూడా కొత్త కెప్టెన్ల సారథ్యంలో బరిలోకి దిగుతున్నాయి. ఢిల్లీ అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా నియమించుకుంది. పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఇక బెంగళూరు సారథిగా రజత్ పటిదార్ ఎంపికయ్యారు. కొత్త కెప్టెన్ల సారథ్యంలో ట్రోఫీని గెలుచుకోవాలని ఈ మూడు జట్లు తహతహలాడుతున్నాయి. ఇక ప్రస్తుత ఛాంపియన్ కోల్‌కతా కూడా కొత్త సారథిని ఎంపిక చేసింది. ఈసారి అజింక్య రహానె కోల్‌కతా టీమ్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు. కిందటి సీజన్‌లో సారథిగా ఉన్న శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రిటేన్ చేసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో అతను వేలం పాటలో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఎంపికయ్యాడు. పంజాబ్ టీమ్ భారీ మొత్తాన్ని వెచ్చించి శ్రేయస్‌ను సొంతం చేసుకుంది.
మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కూడా భారీ ఆశలతో కనిపిస్తోంది. మెగా వేలం పాటలో రిషబ్ పంత్ భారీ మొత్తాన్ని వెచ్చించి సొంతం చేసుకుంది. అనుకున్నట్టే రిషబ్‌కే సారథ్య బాధ్యతలను అప్పగించింది. అతని కెప్టెన్సీలో లక్నో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గుజరాత్ టైటాన్స్ కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది. ఈసారి కూడా శుభ్‌మన్ గిల్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, జోస్ బట్లర్ వంటి టి20 స్పెషలిస్ట్‌లు జట్టులో ఉన్నారు. మాజీ ఛాంపియన్‌లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లు కూడా మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఈసారి ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో రెండు జట్లు కనిపిస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా టైటిల్‌పై కన్నేసింది. కమిన్స్ సారథ్యంలోని హైదరాబాద్ రెండు విభాగాల్లోనూ సమతూకంగా కనిపిస్తోంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్‌లతో హైదరాబాద్ బలంగా ఉంది.