బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా బీఆర్‌ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. కేటీఆర్, హరీష్‌రావు తో పాటు సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లా కీలక నేతలు హాజరయ్యారు. ఈ నెల 27న వరంగల్‌లో బీఆర్‌ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశం పెట్టుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి లక్ష మందికి తగ్గకుండా లక్షలాది మందితో సభ నిర్వహించేలా ప్లాన్ ఉండాలన్నారు. ఆ దిశగా ఫామ్ హౌస్‌కు చేరుకుంటున్న బీఆర్‌ఎస్ మాజీ తాజా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లు, ముఖ్య నేతలకు కేసీఆర్ సూచనలు చేస్తున్నారు. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో నిన్న కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో జరుగనున్న బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై చర్చించారు. బహిరంగ సభ ఏర్పాట్లపై వరంగల్ జిల్లా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ నాయకులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.