యువ ఫిల్మ్ మేకర్స్ ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా సినీ స్టోర్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో కీప్ఇట్‌షార్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సినీస్టోర్ టెక్నాలజీస్ సీఈఓ నాగేందర్ పోలమరాజు మాట్లాడుతూ ఇది దేశంలోనే మొదటి ఫిల్మ్, యానిమేషన్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ అన్నారు. యువ ఫిల్మ్ మేకర్స్ కు ప్రారంభ వేదికగా నిలుస్తుందని తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్ ప్రతిభను వెలికి తీసేందుకు, గుర్తింపు పొందేందుకు ఇతరులతో కలిసే అవకాశం పొందేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 1,500 పైగా ఫిల్మ్ ఇనిస్టిట్యూషన్స్, 1,200 యానిమేషన్ ఇన్స్టిట్యూట్లకు చెందిన ఐదు లక్షలపైగా ప్రస్తుత, పూర్వ విద్యార్థులు కలరన్నారు. ఈ ప్లాట్‌ఫామ్ ప్రారంభంలో వెయ్యి నుంచి పన్నెండు వందల షోరీల్స్ లేదా టీమ్ ఎంట్రీలు (ఒక్కో టీమ్‌లో కనీసం ఐదుగురు సభ్యులు) అందుకుంటుందని అంచనా ఉందన్నారు. దీని ద్వారా ఆరు వేలకు పైగా యువ ఫిల్మ్ మేకర్స్ పాల్గొననున్నారని అర్థం అవుతుందన్నారు.
ఈ కీప్ఇట్‌షార్ట్ వేదిక వినూత్న డిజిటల్ టూల్స్ అందుబాటులోకి తెచ్చి డేటా ఆధారిత నిర్ణయాల ద్వారా సినిమా తయారీ వ్యవస్థను ప్రజలందరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ ప్లాట్‌ఫామ్ దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, కథా రచన, స్క్రీన్ రైటింగ్ రంగాల్లో సృజనాత్మకతకు ఒక వేదికను అందిస్తుంది తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఫిల్మ్, యానిమేషన్ ఇన్ స్టిట్యూట్స్, మీడియా గవర్నింగ్ బాడీలు ఈ ప్లాట్‌ఫామ్‌తో కలిసి పని చేయడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయన్నారు. చాలా ప్రొడక్షన్ హౌసులు ఈ ప్లాట్‌ఫామ్‌పై ఆసక్తి చూపుతుండటం విశేషం అన్నారు. కొత్త కథలు, వినూత్న ఆలోచనలు వినిపించే విద్యార్థుల కోసం ఇప్పటికే స్కౌటింగ్ చేస్తున్నారన్నారు. వినోద రంగంలో కొత్త శైలితో కూడిన ప్రతిభను వెలికితీయడంలో కీలక పాత్ర పోషించనుందని పేర్కొన్నారు.
యువ ఫిల్మ్ మేకర్స్ చేతుల్లోకి తిరిగి అధికారం పెట్టడానికి కీప్ఇట్‌షార్ట్ ను నిర్మించామన్నారు. ప్రతిభ ఉన్నవాళ్లు పైకి రావాలన్నారు. దీనికి పరిచయాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. చదువుకుంటున్నప్పుడే దర్శకత్వం, కథ రాయడం, ఎడిటింగ్, సౌండ్ లాంటి పనులు చేయడానికి కీప్ఇట్‌షార్ట్ ఒక మంచి వేదిక అన్నారు. వాళ్లు తీసే సినిమాలు ఇండస్ట్రీలో పెద్ద వాళ్లకి కూడా చేరుతాయన్నారు. విద్యార్థుల కష్టానికి తగిన గుర్తింపు రావాలన్నదే తమ లక్ష్యమన్నారు.