Monday, April 14, 2025
spot_img

పెట్రోల ధరలతో కేంద్రం ఆర్థిక దోపిడీ

Must Read
  • సెస్సు వసూళ్లతో సొంత రాజకీయ ప్రచారాలు
  • సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న మోడీ
  • పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి
  • కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరికి కేటీఆర్‌ లేఖ

పెట్రోల్‌ రేట్లను సెస్సుల రూపంలో పెంచుతూ మోదీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక దోపిడికి పాల్పడుతూ రాష్ట్రాల హక్కులను కబళిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. వసూలైన సెస్సులతో మౌలిక సదుపాయాలను కల్పించకుండా తమ సొంత రాజకీయ అజెండా ప్రచారాల కోసం వినియోగిస్తున్నారని మండిపడ్డారు. పన్నుల్లో రావాల్సిన న్యాయమైన వాటాను రాష్ట్రాల‌కు ఇవ్వకుండా దేశ సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలకు మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి గణనీయంగా సహకరిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలు నిధుల కొరతతో అల్లాడుతుంటే అక్రమంగా వసూలు చేస్తున్న సెస్సులతో సమకూరుతున్న ఆదాయంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల‌పై పెత్తనం చెలాయిస్తుందన్నారు. ఆకాశాన్నంటుతున్న పెట్రో ధరలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీకి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్‌, ఇంధన ధరల్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశాల్లో ఒకటిగా మనదేశం నిలిచిందని విమర్శించారు. భూటాన్‌, పాకిస్తాన్‌, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో కూడా పెట్రో, డిజిల్‌, ఎల్‌పీజీ ధరలు భారత్‌లో కంటే చౌకగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ. 1,100 దాటడం పేద, మధ్యతరగతి ఆడపడుచులకు భరించలేని భారంగా మారిందన్నారు కేటీఆర్‌. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన ఒక క్రూరమైన జోక్‌గా మారిందన్నారు. ఒకప్పుడు ఉజ్వల యోజన కింద సిలిండర్లు తీసుకున్న మహిళలు, పెరిగిన గ్యాస్‌ ధరలతో మళ్లీ కట్టెలపైనే వంట చేస్తున్నారని చెప్పారు. గతంలో అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 100 డాలర్లు దాటినప్పుడు కూడా ఇప్పటితో పోలిస్తే దేశంలో ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయని, ఇప్పుడు క్రూడ్‌ ధరలు తగ్గినప్పటికీ ప్రజలపై భారం పెంచడం దేనికి సంకేతమని కేటీఆర్‌ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులతో పాటు బిజెపి నేతలు అంతా గతంలో పెట్రో ధరలు తగ్గించమని ఆందోళన కార్యక్రమాలు చేసిన విషయాన్ని కేటీఆర్‌ తన లేఖలో ప్రస్తావించారు. కేంద్రం పెంచుతున్న పెట్రోల్‌ గ్యాస్‌ ధరల వలన పేద ప్రజల జేబులు ఖాళీ అవుతుండగా ఆయిల్‌ కంపెనీలకు వేలకోట్ల రూపాయలు చేరుతున్నాయన్నారు. ఎన్నికల సమయంలో ధరలు స్థిరంగా ఉంచి, ఓట్లు- పండగ అయిపోగానే పెంచడం ప్రజల్ని వంచించడమే అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మినిమం గవర్నమెంట్‌, మాక్సిమం గవర్నన్స్‌ అన్న కేంద్ర ప్రభుత్వ నినాదం ‘మాక్సిమం టాక్సేషన్‌, మినిమం రిలీఫ్‌‘గా మారిందని విమర్శించారు. మోడీ చెప్పిన ‘అచ్ఛే దిన్‌‘ అంటే ఈఎంఐలు కట్టలేక, ఇంధన బిల్లుల భారం భరించలేక మిడిల్‌ క్లాస్‌ సతమతమవడం, సిలిండర్‌ తెచ్చుకోవాలా? సరుకులు కొనుక్కోవాలా? అన్న విూమాంసలో పేదలు ఉండిపోవడం, రాష్ట్రాలు తమ స్వయంప్రతిపత్తిని కోల్పోవడమేనా అని కేటీఆర్‌ పశ్నించారు. దేశంలోని కోట్లాది ప్రజల తరపున రాసిన ఈ లేఖలో, ప్రజల తరపున కొన్ని డిమాండ్లను కేంద్రమంత్రి ముందు కేటీఆర్‌ ఉంచారు. ఇంధన ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని, కేంద్ర ఎక్సైజ్‌ సుంకాలను గణనీయంగా తగ్గించి, రాష్ట్రాల‌కు ఇవ్వని సెస్‌లను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అంతర్జాతీయ క్రూడ్‌ ధరలకు అనుగుణంగా పారదర్శక ధరల విధానం అమలు చేయాలన్నారు. ఇంధన పన్నులు, సెస్‌ వినియోగం, ఆదాయ వాటా వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని, ఆర్థిక కేంద్రీకరణ విధానాలను విడనాడి, నిజమైన సహకార ఫెడరలిజాన్ని పునరుద్ధరించాలని సూచించారు. దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం కేందప్రభుత్వానికి వచ్చిందన్నారు కేటీఆర్‌. ఆకట్టుకునే నినాదాల వెనుక దాక్కోవడం మాని, అసలైన పని చేయాలని కేటీఆర్‌ ఊచించారు.

Latest News

రాజ్యాధికార సాధననే బీసీలకు అంతిమ లక్ష్యం కావాలి

ఫార్ములా 21 తో జిల్లా, పట్టణ ,మండల కమిటీల నిర్మాణం.. అన్ని స్థాయిలలో బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు ములుగు జిల్లా కన్వీనర్ గా వడ్డేపల్లి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS