తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపణ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్‌సీఏలో అక్రమాల వెనుక మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత హస్తముందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ఆరోపించింది. ఈ మేరకు సీఐడీ డీజీ చారుసిన్హాకు టీసీఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి గురువారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో మరికొందరు అక్రమార్కులు కూడా ఉన్నారని.. వారిపైనా విచారణ జరిపించాలని కోరారు. జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంకా ప్రతాప్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదిలావుంటే ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తనకు సంబంధం లేని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారంలో తలదూర్చడంతో అధికారులు ఎలక్షన్ రెడ్డిపై వేటు వేశారు. కాగా, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌లో భారీగా నిధుల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావుతో పాటు హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్, ట్రెజరర్ జగన్నాథ్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్ కుమార్, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రెటరీ రాజేందర్ యాదవ్, రాజేందర్ యాదవ్ భార్య కవిత మొత్తం ఆరుగురిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.