టీపీసీసీ ఆధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని టీపీసీసీ ఆధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. గతంలో అయనే స్వయంగా హెచ్‌సీయూలో 5 బిల్డింగులను మోదీ వర్చువల్ గా ప్రారంభించారని గుర్తు చేశారు. సోమవారం నాడు తెలంగాణ అంశాలపై ప్రధాని హర్యానాలో ప్రస్తావించిన తరుణంలో అయా అంశాల పై టీపీసీసీ ఆధ్యక్షులు స్పందించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మోదీ ప్రారంభించిన బిల్డింగులకు మున్సిపల్, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ పర్మిషన్లు ఏమీ కూడా లేవనే విషయాన్ని అయన తెలుసుకోవాలన్నారు. మోదీ హయాంలో కూడా హెచ్‌సీయూలో భూముల్లోని చెట్లను నరకడం జరిగిందని తెలిపారు. ఇపుడు పర్యావరణం గురించి మోదీ మాటలు చూస్తే దయ్యాలు వేదాలు వల్లలించినట్టు ఉందని అన్నారు. కార్పోరేట్ కంపెనీల కోసం అటవీ భూములు లక్షల ఎకరాలు కట్టబెట్టారని దుయ్యబట్టారు. చివరకు మోదీ ర్యాలీ కోసం వేల చెట్లు నరికేశారని ఆరోపించారు. అహ్మదాబాద్‌లోని గాంధీ నగర్లో 17 వేల చెట్లు నరికామని అయనే ఒప్పుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 5 సంవత్సరాల్లో లక్ష తొమ్మిది వేల చెట్లను మోదీ ప్రభుత్వం నరికేసిందని పార్లమెంట్లో చెప్పారని వివరించారు. అదానీ, అంబానీ కోసం లక్షల ఎకరాల ఫారెస్ట్ భూములను మోదీ నాశనం చేసారని ఆరోపించారు. హెచ్‌సియూ భూములపై మోదీ సమగ్ర సమాచారం తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. తెలంగాణలో సన్న బియ్యం, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులఘనన లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు జరుగుతుంటే మోడీ వాటి గురించి మాట్లాడే ధైర్యం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ఆ విషయం మాట్లాడ్డం లేదని, తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పై చర్చ జరగకుండా ఇలా మోడీ చేస్తున్నాడా అని నిలదీశారు.