300 మందికిపైగా ప్రాణాలు బలి
హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాల విరుచుకుపడటం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. కుంభవృష్టి, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులతో పర్వత రాష్ట్రం విలవిలలాడుతోంది. జూన్ 20న వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 310 మంది ప్రాణాలు కోల్పోవడం ఈ పరిస్థితి తీవ్రతను చూపుతోంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (HPSDMA) తాజా గణాంకాల ప్రకారం, 310మంది మరణించిన వారిలో 158 మంది నేరుగా వర్ష సంబంధిత ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వీటిలో కొండచరియలు కూలిపడటం, ఇళ్లు కూలిపోవడం, వరదల్లో కొట్టుకుపోవడం, విద్యుత్ షాక్ వంటి సంఘటనలు ప్రధానమైనవి. మరో 152 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. ఇప్పటివరకు 369 మంది గాయపడగా, 38 మంది ఆచూకీ లేకుండా పోయారు.
జిల్లాల వారీగా చూస్తే, మండి జిల్లా అత్యధికంగా ప్రభావితమైంది. ఇక్కడ 51 మరణాలు సంభవించాయి. తరువాత కాంగ్రా 49, చంబా 36, సిమ్లా 28 మరణాలతో తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. ప్రభుత్వం అంచనా ప్రకారం, ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్తుల నష్టం విలువ మొత్తం రూ.2,62,336.38 లక్షలు (దాదాపు రూ.26,000 కోట్లు) దాటింది. ఇళ్లు, పంటలు, వాణిజ్య స్థాపనలు, రహదారులు, వంతెనలు, విద్యుత్ సదుపాయాలు నాశనమయ్యాయి. ఆగస్టు 27 సాయంత్రం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 582 రహదారులు మూసివేయబడ్డాయి. వీటిలో రెండు జాతీయ రహదారులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కులు, మండి, కాంగ్రా, సిమ్లా జిల్లాలు అత్యంత తీవ్ర ప్రభావం ఎదుర్కొంటున్నాయి. కులు జిల్లాలోని ఎన్‌హెచ్-03, ఎన్‌హెచ్-305 మార్గాలను మూసివేయడం వల్ల రవాణా పూర్తిగా దెబ్బతింది. అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా 1,155 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా, 346 తాగునీటి పథకాలు స్తంభించిపోయాయి. దీంతో అనేక ప్రాంతాలు విద్యుత్, నీటి సరఫరా అంతరాయం వల్ల ఇబ్బందులు పడుతున్నాయి.