- ముదిరాజ్ కార్పొరేషన్ కు వచ్చే ప్రతి పైసా ముదిరాజ్ పేద బిడ్డలకే
- ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్
రాష్ట్ర ప్రభుత్వం నుండి ముదిరాజ్ కార్పొరేషన్ కు వచ్చే ప్రతి పైసా ముదిరాజ్ పేద బిడ్డలకే అందిస్తానని ముదిరాజ్ కార్పొరేటర్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ టివోలీ గార్డెన్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ కులస్తుల కోసం ముదిరాజ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిందని… మన ముదిరాజ్ లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఒక ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసిందన్నారు. ఈ ప్లాట్ ఫామ్ ను ప్రతి ముదిరాజ్ బిడ్డ వినియోగించుకొని ఆర్థికంగా, సామాజికంగా ఎదిగాలన్నారు. కోకాపేట లో 5 ఎకరాల స్థలం ఉందని ఆ స్థలంలో ముదిరాజ్ భవన్ ను కట్టిస్తానని ఆయన వెల్లడించారు. పార్టీలకతీతంగా ముదిరాజ్ నాయకులంతా ఏకమై ముదిరాజు కులస్తులను ఆర్థికంగా ఎదిగే విధంగా సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ విషయంలో ముదిరాజ్ జర్నలిస్టులు సహకరించి రాష్ట్రంలో ఉన్న పేద ముదిరాజ్ బిడ్డలకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు.
గత పాలకులు ముదిరాజ్ కులస్తులను విభజించి పాలించారని… అందుకే మనమంతా వెనుక పడ్డామన్నారు. అనంతరం జర్నలిస్టు సంఘం నాయకులు చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం గౌరవ అధ్యక్షులు బలరాం, రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు చింతల నీలకంఠం, ప్రధాన కార్యదర్శి బోయిన శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గడ్డమీద శ్రీశైలం, గోనెల కుమార్, ఇండస్ట్రీ అధ్యక్షుడు ప్రభాకర్, అడ్వకేట్ ముదిరాజ్ సంఘం వినోద్ కుమార్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సుగ్రీవుడు, రాష్ట్రం ముదిరాజ్ జర్నలిస్టు సంఘం నాయకులు సతీష్, శివ, మల్లికార్జున్, భూమయ్య, శివన్న, హరికుమార్, చింతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.