- ప్రజాపాలనలో ఇతర రాష్ట్రాలకు సింగరేణి విస్తరణ
- ఒడిశాలో సింగరేణి గని ఏర్పాటు తెలంగాణకే గర్వకారణం
- 13 దశాబ్దాల సింగరేణి చరిత్రలో నైనీ గని ప్రారంభం ఒక సువర్ణాధ్యాయం
- ఒడిశాలో నైనీ గనిని వర్చువల్‌గా ప్రారంభించిన భట్టి విక్రమార్క
సింగరేణి సంస్థ తన 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గని ప్రారంభించుకోవడం ఒక సువర్ణ అధ్యాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కమల్లు అన్నారు. ఒడిశా రాష్ట్రంలో నైనీ గని ప్రారంభంతో సింగరేణి తన విశ్వవ్యాప్త విస్తరణకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. బుధవారం మహాత్మా జ్యోతి రావ్ ఫూలే ప్రజా భవన్ నుంచి ఆయన ఒడిశా రాష్ట్రంలో సింగరేణి చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ ను వర్చువల్‌గా ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒడిశాలో గని ప్రారంభించడం సింగరేణి సంస్థకే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆనందకరమైన సందర్భం అన్నారు. ఈ బొగ్గు బ్లాక్ను సింగరేణికి కేటాయించి తొమ్మిది ఏళ్ళు అయినప్పటికీ వివిధ రకాల అనుమతులు అందడంలో జాప్యం వల్ల ప్రారంభానికి నోచుకోలేదన్నారు.
ఏడాది క్రితం ప్రజా ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, తాను కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని పలుమార్లు కలిసి పూర్తి అనుమతులకు సానుకూలత సాధించామన్నారు. ప్రభుత్వం చూపిన ప్రత్యేక చొరవ వల్లే ఏడాదిలోనే దీనిని ప్రారంభించుకోవడం ప్రజా ప్రభుత్వానికి సింగరేణి అభివృద్ధిపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. నేడు ఒడిశాలో ప్రారంభించిన నైనీ బొగ్గు బ్లాకు సింగరేణి విస్తరణలో ఒక తొలి అడుగుగా ఆయన అభివర్ణించారు. ఇక్కడి నుండి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా సింగరేణి విస్తరిస్తుందన్నారు. త్వరలో సింగరేణి గ్లోబల్ కంపెనీగా రూపుదిద్దుకోనుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నైనీ గని ప్రారంభానికి సహకరించిన కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికి, ఒడిశా ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మారీaకి, స్థానిక ఎమ్మెల్యే అగస్థీ బెహరా, ఇతర ప్రజాప్రతినిధులకు తన ధన్యవాదాలు తెలిపారు.
అంగూల్ అభివృద్ధికి పూర్తి కృషి,…
గత ఏడాది జులైలో తన ఒడిశా పర్యటన సందర్భంగా అంగూల్ ప్రాంత అభివృద్ధికి తాను ఇచ్చిన ప్రతీ హామీని త్వరలోనే సింగరేణి సంస్థ అమలు జరుపుతుందని, ఆ ప్రాంత సర్వతో ముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ అని, కేవలం వాణిజ్యం కోసం పనిచేసే కంపెనీ కాదని, సామాజిక స్పృహతో ఇక్కడ కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు. అంగూల్ ప్రాంత ప్రజల ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపరచడం కోసం 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా నైనీ కి సమీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, దీనికి సంబంధించిన స్థల సేకరణకు ఒడిశా ప్రభుత్వం సహకరించాల్సిందిగా కోరారు. ఇతర రాష్ట్రంలో తొలిసారిగా బొగ్గు తవ్వకం ప్రారంభించిన సింగరేణి, ఈ గనిని ఆదర్శప్రాయంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఒడిశాలో సింగరేణి బొగ్గు గని ప్రారంభించడం ఒక చరిత్రాత్మక సందర్భమని, ఇది సింగరేణి అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. నైనీ బొగ్గు గని వద్ద జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అగస్తి బెహరా, సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరామ్, ప్రజా భవన్ నుంచి ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఓఎస్డీ సురేందర్ రెడ్డి, సింగరేణి ఈడీ (కోల్ మూమెంట్) ఎస్డి.ఎం.సుభానీ పాల్గొనగా నైనీ నుంచిసంస్థ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, నైనీ జీఎం టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.