భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడటానికి త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ సైనికులు (సోల్జర్స్), నావికాదళ నావికులు (సెయిలర్స్), వైమానిక దళ ఏయిర్మెన్ త్యాగాల పునాదులు ఊపిరులూదుతున్నాయి. మన త్రివిధ దళాలకు చెందిన సాయుధ బలగాల అంకితభావం, నిబద్ధత, విధి నిర్వహణ, దేశభక్తి, క్రమశిక్షణ, ప్రాణాలకు తెగించి పోరాడటం, ధైర్య శౌర్య పరాక్రమాలను గుర్తు చేసుకుంటూ వారి శ్రేయస్సు, సంక్షేమాలను కోరుకుంటూ దేశవ్యాప్తంగా 07 డిసెంబర్ రోజున పౌర సమాజం “సాయుధ దళాల పతాక దినోత్సవాలు” నిర్వహించు కుంటూ అమర వీరుల కుటుంబాలకు సానుభూతి, సాయుధ దళాల సంక్షేమ నిధికి విరాళాల రూపంలో చేయూతఅందిస్తూ భక్తితో కార్యక్రమాలు నిర్వహించడం 1949 నుంచి కొనసాగుతున్నది.
సాయుధ దళాల సంక్షేమ నిధికి ఉదారంగా విరాళాల సేకరణ:
దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలకు, వారి పిల్లలకు విద్య అందించడం, గాయపడిన లేదా అంగవైకల్యం పొందిన సైనికులు పునరావాసం, మాజీ సైనికుల సేవలను గుర్తిం చడం, భర్తలను కోల్పోయిన వీర నారీమణులకు చెందే విధంగా స్థానిక సైనిక బోర్డుల నేతృత్వంలో స్టాంపులు, పతాకాలను పంచుతూ సంక్షేమ నిధులను సేకరించడం ఆనవాయితీగా మారింది. దేశవ్యాప్తంగా విస్తరించిన కేంద్ర ప్రభుత్వ సైనిక బోర్డులు, 32 రాష్ట్ర సైనిక బోర్డులు, 392 జిల్లా సైనిక బోర్డుల సహకారంతో పతాక దినోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. దేశ భద్రతే ఊపిరిగా, దేశ సమగ్రతను కాపాడటానికి ప్రాణాలకు తెగించి పోరాడటం, దేశ సరిహద్దు కంచెలుగా అనుక్షణం విధులను నిబద్ధతతో నిర్వహించడం లాంటి సద్గుణాలు మనందరికీ నిత్య ప్రేరణలు అవు తున్నాయి. సాయుధ పతాక దినోత్సవ వేడుకల్లో ఎరుపు(ఆర్మీ), ముదురు నీలం(నావీ), ఆకాశ నీలం (ఏయిర్ఫోర్స్)తో కూడిన జెండాలు, కార్లకు స్టిక్కర్లు, బ్యాడ్జీలు, స్టిక్కర్లు లాంటివి పంచుతూ యువత సంక్షేమ నిధికి విరాళాలు సేకరిస్తుంటారు. పతాక దినోత్సవ వేదికగా ఆర్మీ, నావీ, ఏయిర్ఫోర్స్ విభాగాల సిబ్బంది సేవలను కొనియాడుతూ, మనసు నిండా కృతజ్ఞతలను తెలియజేస్తూ, వారి త్యాగ మయ జీవితాలను ఆదర్శంగా తీసుకుంటూ భరత మాత సేవలో పునీతులం అవుదాం. వీర సైనికుల సాహసాలు, పోరాట పటిమ, శత్రువుల గుండెల్ని చీల్చగల తెగువ కొనియాడదగినవి. ఇలాంటి సాయుధ దళాల సంక్షేమ నిధికి ఉదారంగా వికాసాలు అందజేస్తూ, అమరవీరుల కుటుంబ సభ్యులను కలిసి మన సంఘీభావాన్ని తెలియజేద్దాం. త్రివిధ దళాల అమూల్య సేవలను కొనియాడుదాం.
కెప్టెన్ డా బుర్ర మధుసూదన్ రెడ్డి
అసోసియేట్ ఎస్సిసి ఆఫీసర్ (విశ్రాంత)
9949700037