ఆత్మకూరు (ఎం) మండల పరిధిలోని పల్లెర్ల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోమయ్య మరియు బోధన సిబ్బంది బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తాజా మాజీ జెడ్పిటిసి కోడిత్యాల నరేందర్ గుప్తా మాట్లాడుతూ.. ప్రభుత్వ బడి ముద్దు ప్రైవేటు బడి వద్దు అనే నినాదంతో ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయ సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను పటిష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే, మరోపక్క విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించడం అనాలోచిత చర్య అని ఆయన అన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుండి గ్రామ పెద్దలు, యువత ఏకమై ప్రభుత్వ పాఠశాలు ముద్దు ప్రైవేట్ పాఠశాలలు వద్దు అనే నినాదంపై ఇంటింటా తిరిగి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే బాధ్యత తీసుకోవాలని యువతను కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్, సైన్స్ లాబ్ లతో పాటు డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ప్రభుత్వం పంపిణీ చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్ పై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఆర్ పి ఎస్ మండల అధ్యక్షుడు మేడి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం నుండి పల్లెర్ల గ్రామానికి ప్రైవేటు పాఠశాలల వాహనాలు రావొద్దని, అందుకు కావలసిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. లేనిచో గ్రామపంచాయతీ కార్యాలయం ముందు నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు. బడిబాట కార్యక్రమానికి నాయకులు పొడుగు వెంకటేష్, సోలిపురం ప్రతాపరెడ్డి, కంబాలపల్లి కిష్టయ్య, ఉపాధ్యాయులు వెంకటనర్సయ్య, శంకర్, విజయ్ కుమార్ రెడ్డి, త్యాగరాజు, శేఖర్, షమీమ్, సమీనా, నాగమల్లు, రవీందర్, విజయ, మోహన్, వేణు తదితరులు పాల్గొన్నారు.