- ఏపీలో శాంతిభద్రతలపై మండిపడ్డ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో శాంతిభద్రతలు అదుపులో లేకపోతే హోంమంత్రి బాద్యతను తాను చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని, ఈ విషయంలో హోంమంత్రి వంగలపూడి అనిత కఠినంగా వ్యవహరించాలని సూచించారు. విమర్శలు చేసే వారిని వదలద్దని తెలిపారు. డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.
క్రిమినల్‌కు కులం, మతం ఉండవని, ఈ విషయం పోలీసు అధికారులకు ఎన్నిసార్లు చెప్పాలని ప్రశ్నించారు. ఒకర్ని అరెస్ట్ చేయాలంటే కులం సమస్య వస్తుందట.. మూడేళ్ళ ఆడబిడ్డను అత్యాచారం చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా అని నిలదీశారు. పోలీస్ అధికారులు చదువుకుంది ఐపీఎస్ కాదా..? ఇండియన్ పీనల్ కోడ్ మీకు ఏం చెబుతుంది.. భారతీయ శిక్షాస్మృతి మీకు ఏం చెబుతుంది అని మండిపడ్డారు.
సీఎంను చంపేస్తామని బెదిరించిన వ్యక్తిని ఎందుకు వదిలేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. ఇళ్లలోకి వెళ్ళి మహిళలపై అత్యాచారం చేస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు.