- కంపెనీల కాలుష్యంతో స్థానికుల గగ్గొలు
- వ్యర్థాలు నేరుగా మైనింగ్ గుంతలోకి
- గంటలోపే 40 ఫిర్యాదులు
- గతంలో కంప్లెంట్ చేసిన చర్యలు శూన్యం
- పరిశ్రమల యాజమాన్యాలతో అధికారులు కుమ్మక్కు
- ఎన్నాళ్ళు ఈ కాలుష్య బతుకులంటున్న స్థానికులు
- పీసీబీ రివ్యూలు టీ బిస్కెట్ల కోసమేనా అని మండిపాటు
- కాలుష్య నియంత్రణ మండలి పనితీరుపై విమర్శలు
కూకట్ పల్లి పరిధిలోని ప్రగతినగర్ లో అసోసియేషన్ లేడి ఎంటర్యూరినర్స్ ఆఫ్ ఇండియాకు దగ్గరలో ప్రగతినగర్ లో ఫార్మా కెమికల్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పేరుతో పరిశోధనలు చేయడానికి పరిశ్రమల యూనిట్లు ఏర్పాటు చేశారు. తరచు ఇక్కడి నివాస ప్రాంత వాసులకు ఘాటైన వాసనలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం. పరిశ్రమల యాజమాన్యాలు యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.
ఘాటైన వాసనలతో కమ్ముకున్న కాలుష్యం:
ప్రగతి నగర్ తో పాటు చుట్టుపక్కల కాలనీలకు గత పది సంవత్సరాలుగా వాయు, జల కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఘాటైన వాసనలు వెలువడి ప్రజలు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేయడం అధికారులు టాస్క్ ఫోర్స్ మీటింగ్ కు పిలువడం ఇదో తంతు తప్ప చర్యలు శూన్యం. నాది కాదు నా అత్త గారు సొమ్ము అన్నట్టు ప్రభుత్వ యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. పరిశ్రమల యాజమాన్యాలతో కొమ్ముకాస్తున్న అధికారులు జనం ఘోడు పట్టించుకోవట్లేదు.
కంపెనీలు కాలుష్యం వెదజల్లుతుండడంతో స్థానికులు నిత్యం రోగాల బారిన పడుతున్నారు. గత నెల 28వ తేదీ రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు ఘాటైన వాసనలు రావడంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. దీంతో పెద్దఎత్తున కాలుష్య నియంత్రణ మండలికి వెళ్లి 40మందికి పైగా ఫిర్యాదులు చేయడం జరిగింది. తాము స్థానికంగా ఉండే పరిస్థితులు లేవని వెంటనే ఆయా కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సింది కంప్లెంట్ చేశారు. నిత్యం ఇలాంటి వాసనలతో అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైన కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
ఆగమేఘాల మీద కంపెనీలతో మెంబర్ సెక్రటరీ మీటింగ్ :
కంపెనీల ద్వారా వెలువడే వ్యర్థాలు, ఘాటైన వాసన ద్వారా తాము ఉండలేక పోతున్నామని ప్రగతి నగర్ వాసులు చేసిన ఫిర్యాదులపై కాలుష్య నియంత్రణ మండలి కదిలింది. తీవ్ర అస్వస్థతలకు గురికావాల్సి వస్తుందన్న ప్రజల ఘోడుకు స్పందించిన కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ ఆగమేఘాల మీద పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. తూతూ మంత్రంగా మీటింగ్ ఏర్పాటు చేసి ఇకముందు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక అంతే తన పని అయిపోయింది అన్నట్టుగా అటునుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుండడంతో స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన చర్యలేవి?
ప్రగతి నగర్ పరిశ్రమలపై పర్యావరణ కార్యకర్త పిఎల్‌ఎన్ రావు సంబంధిత 77 పరిశ్రమలపై ఇక్కడి పరిశ్రమల నుండి వెలువడుతున్న వ్యర్ధాలను నేరుగా దగ్గరలో గల మైనింగ్ గుంతలోకి వదులుతున్నారని వాయు కాలుష్యంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులు చేసిన సమయంలో కంటి తుడుపు చర్యగా టాస్క్ పోర్సు మీటింగుకు పిలిచి వారితో కుమ్మక్కైనారని విమర్శలు వచ్చాయి. 28వ తేదీన ప్రజలు చేసిన ఫిర్యాదులపై కూడా పెద్దగా చర్యలు లేవు ఎందుకంటే ఘాటైన వాసనలు పరిశ్రమ నుండి వెలువడుతున్నాయో తెలుసుకునే వరకు సంవత్సరాలు గడుస్తాయి. ఈ లోపు సమస్యల ప్రజలు మర్చిపోతారు. మళ్ళీ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు చూద్దాంలే అని కాలుష్య నియంత్రణ మండలి అధికారుల పనితీరు ఉంటుంది. ఇలా ఎన్ని కంప్లెంట్స్ చేసిన అధికారుల అలసత్వం వల్ల ప్రజల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడన్నట్టుగానే ఉంటున్నాయి.
అవినీతి అధికారులపై చర్యలు ఏవి?
కంపెనీలతో కుమ్మక్కై వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్న అవినీతి అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ప్రగతి నగర్ లోని ఆలీప్ పారిశ్రామికవాడలోని పరిశ్రమల నుండి ఘాటైన వాసులపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ప్రగతి నగర్ పారిశ్రామిక వాడ పరిధికి చెందిన మేడ్చల్ మల్కాజ్ గిరి పర్యావరణ ఇంజనీరు పనితీరుపై ఎందుకు నోటీసులు జారీ చేయలేదో తెల్వదు. అందుకు సంబంధించి అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు రాష్ట్ర కార్యాలయానికి పంపిన నివేదికలపై ఎందుకు చర్చించలేదు. సంబంధిత అధికారులను ఎందుకు బాధ్యుడిని చేయరు అని స్థానికులు నిలదీస్తున్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోకపోతే తరచు ప్రగతి నగర్ లాంటి కాలుష్య సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ప్రజలు కాలుష్యం బారినపడి ఇబ్బందులకు గురి అవుతూనే ఉంటారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై ప్రజలకు నమ్మకం లేకపోవడంతో ప్రజలు పరిశ్రమలు అంటేనే వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది.
కాలుష్య విషం చిమ్మే కంపెనీలపై ఇకనైన ప్రభుత్వం చొరవ చూపాలి. ఈ కాలుష్య నియంత్రణ మండలిపై నమ్మకం పెట్టుకుంటే ఈ ప్రగతి నగర్ ప్రాంతంలో నివాసం ఉండే ప్రజలు పూర్తిగా అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల పాలు కావాల్సిందే. ఇదొక్కటే కాదు సిటీలో ఉంటున్న ప్రజలు కాలుష్యం బారిన పడకుండా ఉండాలంటే విష వాయువులు బయటకు వదులుతున్న పరిశ్రమలపై గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా వ్యవహరించాలి. అప్పుడే ప్రజలు నిమ్మలంగా జీవించగలుగుతారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అవినీతికి పాల్పడి కంపెనీల వద్ద మాముళ్లు తీసుకునే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.