దేశ రాజధాని ఢిల్లీలో ఉమ్మడి కేంద్ర సచివాలయ ప్రాజెక్టు కింద మొత్తం 10 కార్యాలయ భవనాల నిర్మాణాన్ని 22 నెలల్లో పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రకటించింది. వాటిలో మొదటిదైన కర్తవ్య భవన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. సీసీఎస్-3గా పరిగణిస్తున్న కర్తవ్య భవన్‌లోకి కేంద్ర హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, పెట్రోలియం శాఖలతోపాటు ప్రధానమంత్రికి ముఖ్య శాస్త్ర వ్యవహారాల సలహాదారు కార్యాలయాలు తరలివెళ్లనున్నాయి. 2019లో ప్రారంభించిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో సిద్ధమైన మొదటి భవనమిదే. ప్రస్తుతం శాస్త్రి భవన్, కృషి భవన్, నిర్మాణ్ భవన్, ఉద్యోగ్ భవన్‌లలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సీసీఎస్ ప్రాజెక్టు కింద నిర్మితమయ్యే నూతన భవనాల్లోకి క్రమంగా మారిపోతాయి. అన్ని కార్యాలయాలు కొత్త భవనాల్లోకి మారిన తర్వాత పాత భవనాల కూల్చివేతకు టెండర్లు పిలువనున్నట్లు సమాచారం.