( సీజ్ చేసినా… పాఠశాలలు కొనసాగడం వెనుక ఆంతర్యమేంటి.? )
- అనుమతులు లేని పాఠశాలల సంగతేంటి.?
- ప్రైవేటు స్కూల్స్ కు అవినీతి అధికారుల అండ
- కమర్షియల్ భవనాలల్లో కొనసాగుతున్న తరగతులు
- ఏళ్ల తరబడి పాఠశాలలు నిబంధనలు ఉల్లంఘన
- కాకతీయ, కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లార్డ్ స్కూల్ పరిస్థితేంటి ?
- జరిమానాలు వెయ్యకుండా కాలయాపనలు ఎందుకు.?
- ప్రైవేట్ పాఠశాలలను మానిటరింగ్ చేయని అధికారులు.?
- ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న అవినీతి అధికారులపై
కఠిన చర్యలు తీసుకోవాలని మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్
‘చదువు రాక ముందు కాకరకాయ… చదువు వచ్చాక కీకరకాయ’ అన్నట్టు తయారైంది రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పరిస్థితి. విద్యాశాఖ అనుమతి లేకుండా వందల ప్రైవేట్ పాఠశాలలు నడుస్తున్నాయి. వాటి యాజమాన్యాలతో కుమ్మక్కవుతున్న అధికారులు.. ఏదైనా ఘటన వెలుగు చూస్తే తప్ప అనుమతుల విషయాన్ని పట్టించుకోవడం లేదు. రాష్ట్ర రాజధానిని అనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి స్కూల్స్ కోకొల్లలు. గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆందోళనలు చేస్తే తప్ప విద్యాశాఖ స్పందించడం లేదు. ప్రజా సంఘాలు, తల్లిదండ్రులు నెత్తి నోరు కొట్టుకుంటున్న ఎడ్యూకేషన్ డిపార్ట్ మెంట్ కు పట్టడం లేదు. జిల్లా పరిధిలోని ఎన్నో ప్రైవేటు బడులు ఇలాగే కొనసాగుతున్నాయి. యాజమాన్యాల వద్ద అధికారులు ముడుపులు తీసుకొని వాటిని కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విద్యాశాఖ అనుమతులు లేకుండానే రాష్ట్రంలో వందలాది ప్రైవేట్ స్కూల్స్ నడుస్తున్నాయి.. స్కూళ్లలో ఏదైనా ఘటనలు జరిగితే తప్ప వీటి ప్రస్తావన ఎవరూ ఎత్తడంలేదు. సంఘటన జరిగినప్పుడే సమాచారం సేకరించే విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆ తరువాత పట్టించుకోవడంలేదు. కొన్ని స్కూల్స్ రెన్యూవల్ చేసుకోకపోగా, అనుమతులు లేకుండా కొత్తగా వందలాది స్కూల్స్ పుట్టుకొస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు.
రంగారెడ్డి జిల్లాలో గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. స్కూల్ ఎడ్యూకేషన్ అధికారులు బోలేడు మాటలు చెబుతారు. కానీ ఆచరణలో మాత్రం మరోలా ఉంటది. ఈ ప్రైవేట్ పాఠశాలలు అధికారుల పాలిట కామధేనువు లాగా తయారయ్యాయి. గతంలో కాకతీయ, కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, లార్డ్ స్కూల్స్, బచ్‌పన్ స్కూల్ కమర్షియల్ కాంప్లెక్స్ లలో తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే వీటి పైన ఫిర్యాదు చేస్తే రెండు సార్లు షోకాజ్ నోటీసులు జారీ చేసి వదిలేశారు. నియమ, నిబంధనలు పాటించకపోయిన కూడా పాఠశాలలకు వెళ్లి విచారణ చేపట్టకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు.
విద్యాహక్కు చట్టం సెక్షన్ 19, రూల్ 18/ 2009 ప్రకారం అనుమతి లేకుండా ఏ పాఠశాలను కూడా నిర్వహించరాదు, అలా నిర్వహిస్తే స్కూల్ అనుమతులను రద్దుచేయడంతోపాటు లక్ష రూపాయల జరిమానా విధించాల్సి ఉంటుంది. అదే విధంగా రోజుకు రూ. 10,000 చొప్పున జరిమానాలను విధించాలి. కానీ అధికారులు మూడు నెలల నుండి మౌనవ్రతం పాటించడం వెనుక ఆంతర్యామేంటో అర్థం కావడం లేదు.. స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా, చట్టబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, ఎంఈఓ లు నిర్లక్ష్యం వహించడం శోచనీయం. జిల్లాలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్రంగా విచారించి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ కఠిన చర్యలు తీసుకోవాలని మాసాని ప్రేమ్‌కుమార్ డిమాండ్ చేశారు.
సర్కారుకు ఆమ్దానీ లేదు :
ఇలా రంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు అనుమతి లేకుండా వందల సంఖ్యలో నిర్వహిస్తున్నారు. ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు పాఠశాలలు జిల్లా విద్యాశాఖాధికారికి, ఎంఈఓలకు వరంగా మారాయి. కనీస నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూల్స్ పై జరిమానాలు విధిస్తూ కఠినంగా వ్యవహరించాలి. అనుమతులు తీసుకుని కారణంగా సర్కారు ఆదాయానికి రూ. కోట్లలో గండిపడడంతోపాటు.. విద్యార్థులకు సైతం నష్టం వాటిల్లుతోంది. ఆయా పాఠశాలలు ఇచ్చే టీసీలు చెల్లవు. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులు పదో తరగతికి వస్తే పరీక్ష ఫీజు చెల్లించడమూ సాధ్యం కాదు. అయితే జిల్లాలో కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు అనుమతులు లేకుండానే ఆడ్మిషన్లు తీసుకుంటున్నాయి. కొన్ని పాఠశాలల అనుమతి గడువు ముగిసినా.. తిరిగి రెన్యువల్ చేసుకోవడంలేదు. శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ స్కూళ్లు ఒక చోట అనుమతి తీసుకొని మరోక చోట బ్రాంచీలను ఏర్పాటు చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న స్కూల్ బిల్డింగ్ లలో తాత్కలిక కార్యాలయాలు తెరిచి పేరెంట్స్ వద్ద రూ. లక్షలు వసూలు చేస్తున్నాయి. కొన్ని స్కూళ్లు ఒకటి నుంచి ఏడో తరగతి వరకే అనుమతులు తీసుకుని 8, 9, 10 వ తరగతి గదులు నడిపిస్తున్నాయి. మరికొన్ని స్కూళ్లు సాధారణ స్కూల్ అని అనుమతులు తీసుకుని ఇంటర్నేషనల్, టెక్నో, కాన్సెప్ట్ అని రకరకాల ట్యాగ్ లు తగిలించి పేరేంట్స్ వద్ద దోపిడికి పాల్పడుతున్నాయి. ప్రభుత్వానికి కోట్లల్లో ఆదాయాన్ని అందించి బాధ్యతయుతంగా ఉండవలసిన అధికారులు, ప్రైవేట్ మేనేజ్మెంట్లతో చేతులు కలిపి తమ జేబులు నింపుకుంటున్నట్టు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.