21, 22 తేదీల్లో ఖారారైనట్లు వెల్లడి
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఆయన ఈనెల 21 నుంచి 22 వరకు అగ్రరాజ్యం యూఎస్‌లో పర్యటించనున్నారు. ఆ పార్టీ నేత పవన్ ఖేడా గురువారం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఏప్రిల్ 21, 22 తేదీల్లో రాహుల్‌గాంధీ యూఎస్ లో పర్యటిస్తారని ఖేడా తెలిపారు. ఈసందర్భంగా ఆయన రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీని సందర్శిస్తారన్నారు. ఆ వర్సిటీలోని విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడతారని తెలిపారు. దీనికి ముందు ఆయన ఎన్నారై సంఘ సభ్యులతో పాటు ఇండియా ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులతోను సమావేశమవుతారని వెల్లడించారు.
ఇక, గతేడాది సెప్టెంబరులో రాహుల్ మూడ్రోజులు యూఎస్‌లో పర్యటించారు. ఈ పర్యటన సమయంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో రాహుల్ రిజర్వేషన్లు, భారత్‌లో మతస్వేచ్ఛ వంటి అంశాలపై మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు దేశీయంగా తీవ్ర దుమారం రేపాయి. సిక్కులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. భాజపా ఆయన మాటలను ఖండిరచింది. విదేశాల్లో భారత్ పరువు తీస్తున్నారని మండిపడింది.