ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. సివిల్ లైన్స్‌లోని అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయ్’ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. 35 ఏళ్ల యువకుడు ఈ దాడికి పాల్పడగా, ఆయనను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సమాచారం ప్రకారం, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఆ వ్యక్తి ముందుగా కొన్ని పత్రాలు ముఖ్యమంత్రికి అందించాడు. అనంతరం ఆకస్మికంగా అరుస్తూ దాడి చేసినట్లు తెలిసింది. ఊహించని పరిణామంతో సీఎం షాక్‌కు గురవ్వగా, వైద్యపరీక్షల కోసం వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. నిందితుడు రాజ్‌కట్‌కు చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. భాజపా ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సన్దేవ్ దాడిని ఖండించారు. మంత్రి మంజీందర్ సింగ్ సిస్రా మాట్లాడుతూ, “ప్రజల కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రిపై దాడి దారుణం. ఇది ప్రత్యర్థుల కుట్ర కావచ్చనే అనుమానం ఉంది” అన్నారు. ప్రతిపక్ష నేత ఆతిశీ కూడా స్పందిస్తూ, “ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నారని ఆమె తెలిపారు. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ఈ ఘటనను దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. “ముఖ్యమంత్రికే రక్షణ లేకుంటే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి?” అని ఆయన ప్రశ్నించారు.