- అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధరలు
- తులం దర లక్షకు చేరుకుంటుందని అంచనా
బంగారం ధరలు అంతకంతకే పెరిగిపోతున్నాయి. దాంతో సామన్యులకు బంగారం కొనుగోలు తలకు మించిన భారంగా మారిపోతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో రానున్న ఏడాదిన్నర కాలంలో ఔన్స్ బంగారం ధర 3500 డాలర్లకు చేరుకునే అవకాశం ఉన్నదని ఓ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. అంటే భారత కరెన్సీలో తులం బంగారం ధర రూ.1 లక్ష దాటుతుందని ఆ రిసెర్చ్ స్పష్టం చేసింది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో నాన్ కమర్షియల్ కొనుగోళ్లు 10 శాతం పెరిగినప్పుడు మాత్రమే బంగారం ధర ఆ స్థాయికి చేరుతుందని తెలిపింది. 2025లో నాన్ కమర్షియల్ కొనుగోళ్లు 1 శాతం పెరిగితే అంతర్జాతయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం సగటు ధర 3000 డాలర్లకు చేరిందని బోఫా గ్లోబల్ రిసెర్చ్ తెలిపింది. బంగారం ధరలు పెరగడానికి వివిధ కారణాలను సదరు సంస్థ వెల్లడించింది. చైనాకు చెందిన ఓ ఇన్సూరెన్స్ కంపెనీ తన ఆస్తుల్లో ఒక శాతాన్ని బంగారంపై పెట్టు-బడిగా పెట్టనుండటం కూడా బంగారం ధర పెంపునకు కారణమని తెలిపింది. ఆ కంపెనీ ఆస్తుల్లో ఒక శాతం అంటే ఒక ఏడాది గోల్డ్ మార్కెట్ విలువలో 6 శాతానికి సమానమని తెలిపింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు తమ పోర్ట్‌ఫోలియోలను మరింత సమర్థంగా మార్చుకోవడం కోసం ప్రస్తుతం తమ దగ్గరున్న 10 శాతం బంగారం నిల్వలను 30 శాతానికి పెంచుకోబోతున్నాయి. అదేగనుక జరిగితే బంగారం ధరలకు అమాంతం రెక్కలు రానున్నాయని బోఫా గ్లోబల్ రిసెర్చ్ పేర్కొంది. స్టాక్ మార్కెట్ల ఒడిదొడుకుల నేపథ్యంలో రి టైల్ ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతుండటం కూడా ధరలు పెరగడానికి కారణమని తెలిపింది.