Saturday, November 23, 2024
spot_img

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

Must Read
  • కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
  • చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
  • ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
  • ఉన్నతాధికారులు ఇప్పటికైనా అడ్డుకట్ట వేస్తారా.!
  • రెవెన్యూ అధికారులకే సవాలు విసురుతున్న శ్రీ మంజునాథ కన్స్ స్ట్రక్షన్
  • ప్రభుత్వ, అసైన్డ్ భూములను పొతంపెడ్తున్న జి.అమరనాథ్ రెడ్డి
  • శ్రీ మంజునాథ నిర్మాణ సంస్థ, వారి సహచరులు మహాలక్ష్మి కన్స్ స్ట్రక్షన్
  • కోర్టులను తప్పుదోవ పట్టించడం, నిర్మాణ అనుమతులు తేవడంలో సిద్ధహస్తులు
  • అసైన్డ్, ప్రభుత్వ భూమితో శేరిలింగంపల్లి రెవిన్యూ అధికారులకు కాసుల వర్షం.?

మెట్రో సిటీ అయిన హైదరాబాద్ నగరంలో భూముల ధరలకు రెక్కలు రావడం.. కోట్లల్లో రేటు పలుకుతుండడంతో ప్రభుత్వ, అసైన్డ్ ల్యాండ్ కోసం రియల్ వ్యాపారులు ఆశగా వెతుకులాడుతున్నారు. ఎక్కడ ఖాళీ జాగ కనబడితే దాన్నిపై కన్నువేసి కబ్జాచేసే వరకు నిద్రపోవడం లేదు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని విలువైన భూములను కొందరు చెరబడుతున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములే టార్గెట్ గా పథకం రచించి వశం చేసుకుంటున్నారు. సిటీ బాగా డెవలప్ కావడం సాప్ట్ వేర్, ఇతర పెద్ద పెద్ద కంపెనీలు తరలివచ్చి బిజినెస్ బాగా పెంచాయి. దీంతో రియల్ సంస్థలు వెంచర్లు, అపార్టమెంట్స్ నిర్మిస్తున్నాయి బడా బిల్డర్స్. అధికార పార్టీ నేల అండతో మూడు కాయలు, ఆరు పువ్వులుగా వ్యాపారం సాగిస్తున్నారు. భూముల విలువకు తగ్గట్టు ముడుపులు ఇచ్చుకుంటూ ప్రభుత్వ యంత్రాంగంతో దోస్తీ కడుతున్నాయి. ఇలా గత కొన్నేళ్లుగా రాజధాని నగరంలో కోట్లు వెనకేసుకుంటున్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సైతం వీరి వద్ద నుంచి పెద్ద మొత్తంలో లంచాలు తీసుకొని వీరికి అండగా నిలబడుతున్నారు. ఇదే తరహాలో రంగారెడ్డి జిల్లా ఖానామెట్ లోని విలువైన భూములను రెండు నిర్మాణ సంస్థలు అసైన్డ్, ప్రభుత్వ భూములను చెరబట్టాయి. ఖానామెట్ గ్రామంలోని రూ.60కోట్ల భూమి హాంపట్ చేశాయి. 60ఏళ్ల క్రితం ప్రభుత్వ పేదలకు అసైన్డ్ చేసిన భూములను కొల్లగొట్టి వాటిలో పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతున్నాయి.

తెలంగాణలో శేరిలింగంపల్లి నియోజకవర్గం అత్యధిక రెవిన్యూ అందించడంలో మొదటి వరుసలో ఉంటుందడంలో సందేహం లేదు. ఐటీ హబ్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే ఉండటంతో భూముల రేట్లు గజం లక్షలలో పలుకుతుండడం అందరికీ తెలిసిందే. అయితే హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న ఖానామేట్ ఉంది. గ్రామ సర్వే నంబర్ 41లో 252.24 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమి ఉంది. దానిలో గతంతో 1961లో అప్పటి ప్రభుత్వం నిరుపేదలైన 13 మందికి అసైన్డ్ చేయడం జరిగింది. దీనిపై గతంలో ఆదాబ్ హైదారాబాద్ లో కథనం ప్రచురించడం జరిగింది. ఈ ప్రభుత్వ అసైన్డ్ భూములనే మంజునాథ మరియు మహాలక్ష్మి నిర్మాణ సంస్థలు ప్రభుత్వ, అసైన్డ్ భూములను సొంతం చేసుకున్నాయి. ఈ భూములను అధికారులను మేనేజ్ చేసి.. అందులో అనుమతులు తీసుకొని భారీ నిర్మాణాలు చేపట్టి కోట్లు కొల్లగొట్టడం ద్వారా సదరు నిర్మాణ సంస్థలకు అక్షయపాత్రగా మారాయి.

ఖానామేట్ సర్వే నెంబరు 41లో 252.24 ఎకరాల ప్రభుత్వ భూమిలో నుండి 13మంది గ్రామస్తులకు 47ఎకరాల అసైన్డ్ చేసిన విషయమే తెలిసిందే. మసిపూసి మారెడుకాయలు చేసి ఇట్టి ప్రభుత్వ, అసైన్డ్ భూములను మంజునాథ మరియు మహాలక్ష్మి నిర్మాణ సంస్థలు తక్కువ ధరకు కొనుగోలు చేశాయి. ఆ తర్వాత జీహెచ్ఎంసీలో ఇంటి నంబరు మరియు రిజిస్ట్రేషన్ దస్తావేజులతో నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకోవడంతో జీహెచ్ఎంసీ ఇది 22ఏలో ఉందని కానీ, లేదని కానీ సరైన కారణాలు ఏవి చూపకుండా, నిర్మాణ అనుమతి రద్దు చేసేశారు. ఇంకేముంది జీహెచ్ఎంసీ అధికారులు ఉద్దేశ పూర్వకంగానే ఎక్కడ కూడా ఇది అసైన్డ్ భూమి అని అందుచేతనే అనుమతులు రద్దు చేస్తున్నామనే విషయాన్ని పేర్కొన్నారు. దీన్ని అవకాశంగా చేసుకొని సదరు సంస్థలు వెంటనే కోర్టును ఆశ్రయించడం జరిగింది. మంజునాథ మరియు మహాలక్ష్మి నిర్మాణ సంస్థ కోర్టును తప్పుదోవ పట్టిస్తూ జీహెచ్ఎంసీ నిర్మాణ అనుమతి మంజూరు చేయడం లేదని కోర్టును ఆశ్రయించగా, అధికారులు అసైన్డ్ భూమి అని తెలుపకుండా ఉండటం అధికారుల అలసత్వమా, ఉద్దేశపూర్వకమా తెలియదు. కానీ నిర్మాణ అనుమతికి రూట్ క్లియరెన్స్ కావడం, శ్రీ మంజునాథ నిర్మాణ సంస్థకు నిర్మాణ అనుమతి మంజూరు కావడం అధికారుల కనుసన్నలలో జరిగిపోయాయి.

శ్రీ మంజునాథ నిర్మాణ సంస్థ గౌతురి అమర్నాథ్ రెడ్డి ఖానామెట్ లోని సర్వే నంబర్ 41లో ప్రభుత్వము నిరుపేదలకు అసైన్డ్ చేసిన భూములను టార్గెట్ చేస్తూ అసైన్డ్ భూముల పీఓటీ యాక్ట్ 1977 చట్టాలకు విరుద్ధంగా, నిరుపేదలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న ఒరిజినల్ అసైని వారసుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి మాయమాటలు చెప్పి, కొంత మొత్తం ఆశచూపి మోసపూరితంగా వారి ఖరీదైన అసైన్డ్ భూములను అక్రమంగా తన పేరు పైకి మార్చుకుని అక్రమ మార్గంలో హైకోర్టు ముందు వాస్తవాలను దాచి అమర్నాథ్ రెడ్డి అనుమతులు పొందడం అక్కడ భారీ ఎత్తున అపార్ట్ మెంట్లు నిర్మిస్తు, రెవిన్యూ మరియు శేరిలింగంపల్లి సర్కిల్ అధికారులను సైతం మచ్చిక చేసుకుని శ్రీ మంజునాథ కన్స్ట్రక్షన్ వారు వేళ కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. గ్రామంలో అక్రమంగా పొందిన భూములు అనేకం అందులో ఒక్క సర్వే నంబర్ 41/5 అసైన్డ్ భూమి. ఈ అసైన్డ్ భూమిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల గూర్చి అధికారులకు తెలియకుండానే జరుగుతున్నాయా అని వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని గమనిస్తే ఖానామెట్ లోని సర్వే నంబర్ 41/5 లో 2.0 ఎకరాల భూమిని 1961సంవత్సరములో ఫైల్ నం.E1/11998/1960 ద్వారా భూమి లేని నిరుపేదల కోటాలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కటికే రామయ్యకు ప్రభుత్వము అసైన్డ్ చేసింది. ప్రస్తుత రెవిన్యూ రికార్డుల ప్రకారం కూడా పరిశీలిస్తే ఇదే విషయం రుజువు అయితుంది.

అయితే ఆ భూమిని శ్రీ మంజునాథ, మహాలక్ష్మి నిర్మాణ సంస్థలు ఎలా వంశం చేసుకున్నాయి.. ఇందులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారుల పాత్ర ఏంటీ.. అప్పటి ప్రభుత్వం నిరుపేద దళితులైన వారికి అసైన్డ్ చేయగా వారి అసలు వారసులు ఎవరూ.. ఇప్పుడెంత మంది ఉన్నారు.. ఎందరి నుంచి, ఎంత వెల కట్టించి సదరు సంస్థలు కొట్టేశాయి. అసలు అసైన్డ్, ప్రభుత్వ భూములు ఎలా రిజిస్ట్రేషన్ అయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా ఆ భూముల్లో నిర్మాణాలకు పర్మిషన్లు ఎలా వచ్చాయి అనేది రేపటి సంచికలో చూద్దాం…

Latest News

ఆదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్ ఆదానీపై కేసు పెట్టాలని ఎన్నిసార్లు కోరిన ప్రధాని మోదీ పట్టించుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదానీ వ్యవహారంపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS