Saturday, March 22, 2025
spot_img

హనీట్రాప్‌ వ్యవహారంపై దుమారం

Must Read
  • కర్నాటక అసెంబ్లీలో వాడీవేడి చర్చ
  • సిబిఐ విచారణకు బిజెపి డిమాండ్‌
  • 18మంది బిజెపి ఎమ్మెల్యేలపై ఆరు నెలల సస్పెన్షన్‌

కర్ణాటకలో మంత్రులు సహా అనేక మంది ముఖ్యనేతలే లక్ష్యంగా కొనసాగుతోన్న ’హనీ ట్రాప్‌’వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. జాతీయ స్థాయి నేతలు సహా 48 మంది రాజకీయ నాయకులు ఇందులో బాధితులుగా ఉన్నారంటూ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీనిపై శుక్రవారం కర్ణాటక అసెంబ్లీ దద్దరిల్లింది. సమావేశాల వేళ ప్రతిపక్ష భాజపా నేతలు ఈ అంశాన్ని లేవనెత్తడంతో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. దాంతో సభా కార్యక్రమాలకు అడ్డుపడిన 18 మంది భాజపా ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ విధిస్తూ తీర్మానం చేశారు. ఆరు నెలల పాటు వారిపై సస్పెన్షన్‌ వేటు వేస్తున్నట్లు స్పీకర్‌ వెల్లడించారు. సస్పెన్షన్‌ ఉత్తర్వుల ప్రకారం.. వేటుకు గురైన సభ్యులు అసెంబ్లీ హాల్‌, లాబీ, గ్యాలరీలోకి ప్రవేశించకూడదు. వారు ఏ స్టాండింగ్‌ కమిటీ సమావేశాల్లో పాల్గొనకూడదు. అసెంబ్లీ ఎజెండాలో వారి పేర్లతో ఎలాంటి అంశం లిస్ట్ రాకూడదు. ఈ సమయంలో వారికి రోజూవారీ భత్యాలు కూడా అందవు. ఇక సస్పెండైన ఎమ్మెల్యేలను మార్షల్స్‌ బలవంతంగా బయటకు తరలించారు. దీనిపై బిజెపి తీవ్రంగా స్పందించింది. విచారణ కోరితే సస్పెన్షన్‌ వేటు వేయడం, అదికూడా ఆరునెలలు వేయడం దారుణమన్నారు. సిద్దరామయ్య నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం నిజాలు దాస్తోందని విమర్శించారు.

సంచలనంగా మారిన ’హనీ ట్రాప్‌’ వ్యవహారాన్ని శుక్రవారం సభలో భాజపా నేతలు లేవనెత్తారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. హనీ ట్రాప్‌పై విచారణను పక్కనపెట్టి ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును పాస్‌ చేయడాన్ని విమర్శిస్తూ.. స్పీకర్‌ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. భాజపా నేతల తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకసారి కేసు నమోదై.. దర్యాప్తు ప్రారంభమైతే హనీట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన అనేకమంది రాజకీయ నేతలు హనీ ట్రాప్‌లో చిక్కుకు పోయారని కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్‌ రాజన్న ఇటీవల అసెంబ్లీలో పేర్కొనడం తీవ్ర చర్చనీయాం శమైంది. తనకు తెలిసినంతవరకు కనీసం 48 మంది ఇందులో బాధితులుగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదన్నారు. అధికారపక్షం సహా విపక్షానికి చెందినవారు ఈ బాధితుల్లో ఉన్నారన్నారు. అంతకుముందు ఇదే అంశంపై మంత్రి సతీశ్‌ జార్కిహోళీ మాట్లాడుతూ.. ఒక మంత్రిపై రెండుసార్లు హనీ ట్రాప్‌ యత్నం జరిగిన విషయం వాస్తవమేనన్నారు. అయితే, ఇది రాష్ట్రానికి కొత్త కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని పేర్కొన్నారు.

Latest News

ఎస్సీ వర్గీకరణలో చంద్రబాబుది కీలకపాత్ర

ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంపై స్పందించిన మందకృష్ణ ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం చారిత్రక విజయమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS