గోయెంకాపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపాటు
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా మరోసారి వార్తల్లో నిలిచారు. గతేడాది ఎస్‌ఆర్‌హెచ్ చేతిలో దారుణ ఓటమి తరువాత కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై కోప్పడిన సంజీవ్.. తాజాగా ఢిల్లీ చేతిలో లక్నో టీమ్ ఓడిపోవడంతో కొత్త కెప్టెన్ రిషబ్ పంత్‌కు చీవాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. మ్యాచ్ ముగిసిన అనంతరం సంజీవ్-పంత్ మాట్లాడుతున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (75), మిచెల్ మార్ష్ (72) రాణించారు. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. ఓ దశలో 66 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి వైపు పయనించింది. అశుతోష్ శర్మ (66 నాటౌట్), విప్రాజ్ నిగమ్ (39) సంచలన బ్యాటింగ్‌తో ఢిల్లీని గెలిపించారు. ముఖ్యంగా అశుతోష్ శర్మ చివరి వరకు క్రీజ్‌లో నిలబడి టీమ్‌ను విజయ తీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ ప్రదర్శన ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. వేలంలో రూ.27 కోట్లకు దక్కించుకుంది లక్నో. అయితే తొలి మ్యాచ్‌లో ఆరు బంతులు ఆడిన పంత్.. ఒక పరుగు చేయకుండానే డకౌట్ అయ్యాడు. కెప్టెన్‌గా తీసుకున్న నిర్ణయాలు.. కీపింగ్‌లో చేసిన తప్పిదాలతో విజయం ఢిల్లీని వరించింది. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి ఆరు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన సమయంలో చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉంది. స్ట్రైక్‌లో మోహిత్ శర్మ ఉండగా.. బంతిని స్పిన్నర్ షాబాజ్ అహ్మద్‌కు ఇచ్చాడు. తొలి బంతిని మోహిత్ శర్మ క్రీజ్ దాటి ముందుకు ఆడేందుకు ప్రయత్నించగా.. బాల్ మిస్ అయింది. అయితే పంత్ బంతిని అందుకుని స్టంపింగ్ చేయలేకపోయాడు. ఎల్బీ కోసం రివ్యూ కోరినా.. నాటౌట్‌గా తేలింది. తరువాత బంతికి మోహిత్ శర్మ సింగిల్ తీయగా.. మూడో బంతిని అశుతోష్ శర్మ సిక్సర్‌గా మలిచి ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించాడు. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడగొట్టి ఢిల్లీని కష్టాల్లోకి నెట్టిన శార్దుల్ ఠాకూర్‌కు పంత్ రెండు ఓవర్లే ఇవ్వడం విమర్శలకు దారి తీస్తోంది. చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరమైనప్పుడు కూడా శార్దుల్ ఠాకూర్‌ను తీసుకురాలేదు. అనుభవం లేని ప్రిన్స్ యాదవ్‌కు బంతి అప్పగించగా.. 16 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి ఓవర్ అయినా శార్దుల్‌తో వేయించుకుండా.. స్పిన్నర్ షాబాజ్ అహ్మద్‌తో వేయించాడు. ఫస్ట్ బాల్‌కే స్టంపింగ్ రూపంలో గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసి.. పరోక్షంగా తన పాత టీమ్ ఢిల్లీ విజయానికి కారణమయ్యాడు.మ్యాచ్ తర్వాత లక్నో యజమాని సంజీవ్ గోయెంకా, కెప్టెన్ పంత్, కోచ్ జస్టిన్ లాంగర్ ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు. గతేడాది మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేసింది. అయితే వాళ్లు ఏం మాట్లాడుకున్నారో తెలియదు గానీ.. నెట్టింట మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ‘నా రూ.27 కోట్లు నాకు ఇచ్చేయ్..’ అంటూ మీమ్స్ క్రియేట్ చేశారు. సంజీవ్ గోయెంకాపై మరోసారి నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.