- స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
- క్షేత్రస్థాయిలో సమాచారం సేకరణపై దృష్టి సారించాలి
- హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్
పోలీస్‌శాఖలో నిఘా విభాగం (స్పెషల్ బ్రాంచ్) ఎంతో కీలకం అని హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్ల స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బందితో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ,క్షేత్రస్థాయిలో సమాచారం సేకరణపై దృష్టి సారించాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించి ఇవ్వడం వల్ల ఇన్‌స్పెక్టర్, ఉన్నతస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. హైదరాబాద్ సీటీ పోలీసుకు స్పెషల్ బ్రాంచ్ విభాగం ఒక ముఖ్యమైన స్తంభంలాంటిదని పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచిలో విధులు అంటే కొందరు పనిష్‌మెంట్‌గా భావిస్తుంటారని, ఆవిధంగా అనుకోవద్దని సూచించారు. ఇక్కడ పనిచేసినంత కాలం అంకితభావంతో పనిచేయాలని, ఇందులో పనిచేసిన అనుభవం ఏంతో ఉపయోగపడుతుందని తెలిపారు. స్థానిక ప్రజలు, పెద్దలు, నాయకులతో నిరంతరం సత్సంబంధాలు కలిగి ఉండేలా చూసుకోవాలన్నారు. అలా ఉంటేనే నిరంతరం సమాచారం పోందగలుగుతామని తెలిపారు. ఎక్కడ ఏ చిన్న సమాచారం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే ఉన్నతాధికారులకు చెరవేయాలని సూచించారు. బయటి నుంచి కొత్తగా వచ్చే వారిపై నిరంతర నిఘా అవసరమని పేర్కొన్నారు. ఎక్కడైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నా, కొత్త వారు వచ్చినా, వారికి సంబంధించిన బస్తీ, కాలనీ వాసుల నుంచి సమాచారం వచ్చేవిధంగా సోర్స్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. సరిహద్దు దేశాలనుండి నుంచి హైదరాబాద్‌కు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు ఎక్కువగా ఉంటారని, అలాంటి వారిపై నిరంతరం నిఘా అవసరమని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సభలు, సమావేశాలు, క్లాసులు ఏర్పాటు చేసే వారి విషయంలో నిరంతరం సమాచారం వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ సమర్ధవంతంగా పనిచేయడంలో స్పెషల్ బ్రాంచ్ అధికారులు,సిబ్బంది అత్యంత కీలకమైందనే విషయాన్ని ఎప్పడు మర్చిపోవద్దని సీపీ సీవీ ఆనంద్ సూచించారు. స్పెషల్ బ్రాంచ్ అనేది ఒక ప్రత్యేక వ్యవస్థగా పనిచేయాలని, అధికారులు మారిన వెంటనే పనితీరు మారకూడదన్నారు. నిరంతరం ఒకే విధమైన పనితీరుతో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఎవరైనా ఇతర విభాగాల నుంచి ఎస్బీకి బదిలిపై వచ్చే అధికారులకు, సిబ్బందికి ఇక్కడి పనితీరుపై ప్రత్యేక శిక్షణ అవసరమని తెలిపారు. ముఖ్యంగా స్పెషల్ బ్రాంచ్ లో క్షేత్రస్థాయిలో పని చేసే అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. కొత్తగా వచ్చేవారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో నిజాయితీతో, ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా పనిచేయాలని అలాంటప్పుడే పోలీస్ శాఖకు మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. “ట్రూత్ ఏని కాస్ట్” అనే విధంగా పనిచేయాలని సిబ్బందికి సీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఈ సమావేశంలో డీసీపీ ఎస్. చైతన్య కుమార్, ఎస్బీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.