కమిషనరేట్ పరిధిలో నేర నియంత్రణలో ఐటీ సెల్ పాత్ర అభినందనీయం
రాచకొండ కమిషనరేట్ పరిధిలో నమోదైన పలు ప్రాధాన్యమైన మరియు సంక్లిష్టమైన కేసుల దర్యాప్తులో ప్రముఖ పాత్ర పోషించిన రాచకొండ ఐటీ సెల్ సీసీటీవీ బృందాన్ని కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ గారు అభినందించి నగదు పురస్కారం అందించారు. ఇటీవల మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసుతో పాటు, చర్లపల్లి పరిధిలో జరిగిన ప్రాపర్టీ కేసు, భువనగిరి పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసు వంటి పలు ఇతర సంక్లిష్టమైన కేసులను త్వరితగతిన చేదించడంలో ఐటీ సెల్ సీసీటీవీ బృందం యెుక్క సాంకేతికపరమైన కృషిని కమిషనర్ ప్రశంసించారు.
రాచకొండ ఐటీ సెల్ యెుక్క సమర్థవంతమైన పనితీరు ద్వారా ఎన్నో కేసులలో అసలైన నిందితులను వీలైనంత తక్కువ సమయంలోనే పట్టుకోవడం జరుగుతోందని కమిషనర్ పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న దొంగతనాలు, దోపిడీలు, రోడ్డు ప్రమాదాలు, స్త్రీలు మరియు పిల్లల అపహరణ వంటి ఎన్నో కేసులలో బలమైన సాక్ష్యాధారాలను ప్రతీ ఏరియాలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు అందిస్తున్నాయని సీపీ ప్రశంసించారు. ఐటీ సెల్ విభాగంలోని ప్రతి ఒక్కరూ మరింతగా తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపెరుచుకోవాలని, నూతన సాంకేతిక వనరులను ఉపయోగించుకుని కేసుల దర్యాప్తును సులభతరం చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐటీ సెల్ ఏసిపి నరేందర్ గౌడ్, ఇన్స్పెక్టర్ సుధాకర్ మరియు ఇతర సిబ్బంది కమిషనర్ గారి చేతుల మీదుగా నగదు పురస్కారం అందుకున్నారు.