- ఎస్ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ సి.కల్యాణ్ చక్రవర్తి మోసాలు ఎన్నో
- నకిలీ గుర్తింపుతో క్లాస్ 2 కాంట్రాక్టర్ గా కొనసాగింపు
- ప్రభుత్వ ఖజానాకు నిండా ముంచుతున్న వైనం
- ముడుపులతో అధికారులను మచ్చిక చేసుకుంటున్న చక్రవర్తి
- నాణ్యతలేకుండా, సగం పనులు చేసిన పూర్తి బిల్లులు వసూలు
- బ్యాంక్ గ్యారెంటీలో సైతం మోసాలకు పాల్పడ్డ అపరమేధావి
- బోగస్ గ్యారెంటీలతో బొల్తా కొట్టించి, కాంట్రాక్టర్లు పొందిన కళ్యాణ్
‘వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చొన్న తునకలు పడతాయని’ పెద్దలు చెప్పే సామెత కరెక్ట్ అనిపిస్తుంది. అవినీతి అధికారులు ఉన్నంత కాలం మోసాలకు పాల్పడే వారు ఉంటనే ఉంటారు. ప్రభుత్వం ఏదైనా డెవలప్మెంట్, ఇతర పనులు చేయాలంటే కాంట్రాక్టర్లు కావాలి. గవర్నమెంట్ వేసిన టెండర్ల ప్రకారం తక్కువ వ్యయం, ఎక్కువ నాణ్యతతో పనులు చేస్తామన్న వారికి అప్పగిస్తుంది. దీంట్లో కొంతమంది నిజాయితీతో చేస్తే మిగతా వారంతా కక్కుర్తీపడి కడుపునిండ తినేవారే ఉంటారు. వీరికి సర్కారు అధికారులు సపోర్ట్ చేస్తారు. అయితే అందులోను రాజకీయ, డబ్బు పలుకుబడి ఉన్నవారికే ఈ కాంట్రాక్ట్ లు దక్కుతాయనేది మరో విషయం. రాష్ట్రంలో ఎక్కడ, ఏ నిర్మాణం, పని పూర్తి చేయాలన్నా కాంట్రాక్టర్ లతోనే సాధ్యం. ఇదే కాంట్రాక్టర్లను కొందరు ఉన్నతాధికారులు గ్రిప్ లో పెట్టుకుంటారు. నీకింత, నాకింత పద్దతిలో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ లతో ఒప్పందానికి వస్తారు. పని ఏంటీ, దాని కాంట్రాక్ట్ ఎంత అని చూసుకొని నాణ్యతలేకున్నా, పనులు జర అటు, ఇటుగా పూర్తి చేసినా బిల్లుల చెల్లింపు బాధ్యత తమదే అన్నట్టుగా మాట్లాడుకుంటారు. దీంట్లో ఎలాంటి సందేహం, అనుమానాలు అక్కర్లేదు. ప్రభుత్వాలు మారిన, పాలకులు ఎవరొచ్చిన, అధికారులు ట్రాన్సఫర్ అయినా అంతా రోటీనే. కాంట్రాక్టర్, అధికారి ఒక్కటై ప్రభుత్వ పనులు అరకొరగా చేసి పూర్తిస్థాయిలో బిల్లులు దొబ్బి చెరింత తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 11 ఏళ్లు అవుతున్నా ఇప్పుడు జరుగుతున్నది అదే.
జనానికి డబ్బుపై ఉన్న మక్కువ దేనిపై లేదు. ‘తిన మరిగిన కోడి దిబ్బ ఎక్కి కూసిందట’ అన్న చందంగా కాంట్రాక్టర్ల తీరు ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ క్లాస్ 2 సివిల్ కాంట్రాక్టర్‌గా (ప్రొసిడింగ్ నెం.12/AE2/T2Regn-C1-II/M/s. SRC/2025-12, తేదీ: 10-09-2015) గుర్తింపు పొందారు. క్లాస్ 2 కాంట్రాక్టర్‌గా తెలంగాణలో ఏ శాఖలోనైనా దాదాపు రూ.10 కోట్ల మేర సివిల్ పనులు చేసుకోవచ్చు. 2020లో క్లాస్ 2 కాంట్రాక్టర్‌గా అధికారికంగా ఎలాంటి గుర్తింపు లేకుండా పోర్జరీ చేసి 2020-2025 వరకు క్లాస్ 2 గుర్తింపు పొందడం జరిగింది. (ప్రొసిడింగ్ నెం. 09/AE2/T2Regn-C1-II/M/s. SRC/2020-9, తేదీ: 25-09-2020). 2015లో క్లాస్ 2కు చీఫ్ ఇంజనీర్ మహ్మమద్ ఇంతియాజ్ అహ్మద్(పబ్లిక్ హెల్త్), ఆర్. మధుసూదన్ రావు హోల్డింగ్ అకౌంట్ సిటిఈ, ఐ అండ్ క్యాడ్ డిపార్ట్‌మెంట్ సివోటి సభ్యులు హైదరాబాద్, కె. సురేష్ కుమార్ చీఫ్ ఇంజనీర్ జీహెచ్ఎంసీ కమిటీ సభ్యులుగా ఉన్నారు. కానీ, 2020-25లో పోర్జరీ చేసి క్లాస్ 2గా గుర్తింపు పొందిన సర్టిఫికేట్‌ను మళ్లీ వీరే కమిటీ సభ్యులుగా ఉన్నట్లు చూపించారు. కానీ, 2017-2018లో చీఫ్ ఇంజనీర్ మహ్మమద్ ఇంతియాజ్ అహ్మద్ రిటైర్డ్ కావడం జరిగింది. కమిటీ సభ్యులు కూడా మారినట్లు తెలుస్తోంది. ఎస్ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ అయిన సి.కళ్యాణ్ చక్రవర్తి ప్రభుత్వ అధికారులను మోసగించి, క్లాస్ 2 కాంట్రాక్టర్‌గా వివిధ శాఖల నుండి కోట్ల రూపాయల విలువైన పనులు పొందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
‘అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు’గా సి.కళ్యాణ్ చక్రవర్తి వ్యవహరించారు. అదే విధంగా 2016లో కూడా క్లాస్ 2 బోగస్ పత్రాలు సృష్టించడం జరిగింది. తద్వారా ఖైరతాబాద్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఎల్‌బీ నగర్ సర్కిల్‌లో కూడా పనులు చేశారు. ఐ అండ్ క్యాడ్ డిపార్ట్‌మెంట్‌లో స్పెషల్ క్లాస్ లైసెన్స్ గుర్తింపు పొందారు. ఎస్ఆర్‌సి కన్‌స్ట్రక్షన్స్ పేరుతో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే ప్రభుత్వ అధికార వెబ్‌సైట్‌లో కమిషనరేట్ ఆఫ్ టెండర్ లో సర్చ్ చేస్తే ఎస్ఆర్‌సి ఎంటర్‌ప్రైసెస్ పేరు పెట్టుకొని, ఎస్ఆర్‌సి కన్‌స్ట్రక్షన్స్ వివరాలు కనిపించడం జరుగుతుంది. సర్టిఫికేట్ ఒక పేరుతో, వెబ్‌సైట్‌లో మరో పేరుతో ఉండడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం జీఎస్టీ, ఐటీ, పన్నులు ఎగ్గొట్టడానికి ఈ తప్పుడు పనులు చేసినట్లు కొంతమంది కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. క్లాస్ 2 కాంట్రాక్టర్ లైసెన్స్ 2020 నుండి 2025 వరకు ఉండగా, ముసాపేట్ సర్కిల్ లో 2021-2022 క్లాస్ 5 రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకున్నాడు. అంటే ఇక్కడ స్పష్టంగా 2020 నుండి 2025 వరకు చేసుకున్న సర్టిఫికేట్ బోగస్ కావడంతోనే 2021-2022 క్లాస్ 5 కాంట్రాక్టర్ తీసుకున్నాడనే ఆరోపణలు సైతం ఉన్నాయి. స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ గుర్తింపునకు ముందు కిందిస్థాయి గుర్తింపు కాంట్రాక్టర్ లైసెన్స్‌ను సరెండర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వారి నుండి ఎన్ఓసీ తీసుకోవాలి. స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ గా గుర్తింపు పొందే సమయంలో క్లాస్ 5 లైసెన్స్‌ను రద్దు చేసినట్లు ఐ అండ్ క్యాడ్ శాఖకు చూపించడం జరిగింది. కానీ, 2020-2025లో క్లాస్ 2 గుర్తింపు సర్టిఫికేట్‌ను సరెండర్ చేయలేదు. ఎందుకంటే అది ఫేక్ సర్టిఫికేట్ కావడం వలన మోసాలు బయటకు వస్తాయన్న ఉద్దేశ్యంతో ఆ సర్టిఫికేట్‌ను సరెండర్ చేయలేదు..
బ్యాంక్ గ్యారెంటీలతో మరో స్కామ్ :
‘అంధుడికి అద్దం చూపించినట్లు’ అన్నట్టుగా ఎన్నో అవకతవకలకు పాల్పడే వారికి స్కామ్ లు చేయడం కొత్తేమి కాదు. అధికారులను అడ్డం పెట్టుకొని ఏదో రకంగా పని చేసుకుంటారు. కాంట్రాక్టర్ టెండర్‌లో పాల్గొనేటప్పుడు ప్రభుత్వానికి ఎస్టిమేట్ కాంట్రాక్ట్ వాల్యూపైన 1శాతం ఈఎండీ రూపంలో చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ టెండర్ కాంట్రాక్టర్‌కు వచ్చినట్లయితే.. అగ్రిమెంట్ సమయంలో మరో 1.5 శాతం ఈఎండీ కట్టాల్సి ఉంటుంది. అర్హులు కానీ కాంట్రాక్టర్లకు వారు చెల్లించిన ఈఎండీలు తిరిగి ఇవ్వడం జరుగుంది. అయితే కాంట్రాక్టర్ బ్యాంక్ నుండి గ్యారెంటీ తీసుకుని టెండర్‌లో ఈఎండీకి 1శాతానికి తీసుకొని, అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ గ్యారెంటీ ప్రతాలపై ఆ టెండర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపర్చి, బ్యాంక్ మేనేజర్‌తో గుర్తింపు పొందడం జరుగుతుంది. కానీ, ఎస్ఆర్‌సి కన్‌స్ట్రక్షన్ బ్యాంక్ గ్యారెంటీలన్నీ యూనియన్ బ్యాంక్ సరూర్ నగర్, ఎస్‌బీఐ నాగార్జున కాలనీ, హస్తీనాపురం లకు సంబంధించిన బ్యాంక్ అధికారుల సంతకాలు పోర్జరీ చేసి అప్‌లోడ్ చేయడం జరిగింది.
ఈ విషయాలపై తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎంఫోర్స్‌మెంట్ అధికారులు ఎస్ఆర్‌సి కన్‌స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ కళ్యాణ్ చక్రవర్తిని సమగ్రంగా విచారిస్తే అతడు చేసిన అవినీతి అక్రమాలు మరన్ని బట్టబయలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్ఆర్‌సి కన్‌స్ట్రక్షన్స్ వివిధ శాఖలలో చేసిన పనుల నాణ్యత, సగం పనులు చేసిన పూర్తి బిల్లులు తీసుకున్న విషయాలపై మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకురానుంది. ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం.
కాగా, ఈ విషయాలపై ఎస్ఆర్‌సి కన్‌స్ట్రక్షన్స్ ప్రొపరేటర్ కళ్యాణ్ చక్రవర్తిని ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి వివరణ కోరగా, ఈ విషయం నా దృష్టిలో లేదు.. నేను తెలుసుకుంటాను అని చెప్పడం విడ్డూరం..