ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని విమర్శ
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ఎన్నికల్లో విస్తృత అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికల నాటి వెబ్ కాస్టింగ్ ఫుటేజీని ప్రజల ముందుంచాలని సవాల్ విసిరారు.
సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించిన శ్యామల, ఉపఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం ప్రవర్తించిన తీరును రాష్ట్ర ప్రజలంతా గమనించారని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయనే విషయం ఈ ఫలితాలు రుజువు చేశాయని విమర్శించారు. అధికార టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ప్రభుత్వ పారదర్శకతను నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
గమనించదగ్గ విషయం ఏంటంటే, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. పులివెందులలో మారెడ్డి లతారెడ్డి, ఒంటిమిట్టలో ముద్దుకృష్ణారెడ్డి గెలుపొందారు. ముఖ్యంగా, జగన్ బలమైన కోటగా భావించే పులివెందులలో టీడీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందోత్సవాల్లో మునిగిపోయాయి.