- 30 ఏళ్ల తర్వాత చరిత్ర
- విజయంపై టీడీపీ నేతలంతా మాట్లాడాలి
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,050 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి డిపాజిట్ కూడా రాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ఈ విజయంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగినందువల్లే 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు తెలిపారు. “30 ఏళ్ల తర్వాత ఓటు వేసే అవకాశం వచ్చినందుకు ప్రజలు ఉత్సాహంగా బ్యాలెట్ బాక్సుల్లో స్లిప్పులు వేశారు. పులివెందుల పరిస్థితులను రాష్ట్ర ప్రజలు గమనించారు,” అని అన్నారు. నేతలందరూ ఈ విజయంపై మాట్లాడి ప్రజలను చైతన్యం చేయాలని సూచించిన చంద్రబాబు, “30 ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాసాం. జగన్ అరాచకాల నుంచి ప్రజలు బయటపడుతున్నారు. పులివెందుల ప్రజలు ధైర్యంగా ఓటు వేసిన విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయాలి,” అని మంత్రులకు సూచించారు.