- ఓయూలో తెలంగాణ జెఎసి ఆందోళన
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మెయిన్ లైబ్రరీ ఎదుట నిర్వహించిన నిరసన అనంతరం జేఏసీ అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో హామీ ఇచ్చిన ప్రకారం ఇప్పటివరకు 13 ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. నోటిఫికేషన్లు ఇంకా విడుదల చేయొద్దని నిరుద్యోగులు కోరుతున్నారని డిప్యూటీ- సీఎం బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సంవత్సరానికి రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. నోటిఫికేషన్లు విడుదల చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వచ్చేనెల 1వ తేదీ లోపు నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే వచ్చే నెలలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిరుద్యోగులతో భారీ సింహగర్జన నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పటికి స్పందించకపోతే ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ అంశంపై చర్చించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు.